Saturday, December 21, 2024

కర్నాటకలో వర్గీకరణ సెగ

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో శాసన సభ ఎన్నికలు కొద్ది వారాల్లో జరగనుండగా షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారం భారీ ఆందోళనకు దారి తీయడం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బిజెపి ప్రభుత్వ అసమర్థతను సూచిస్తున్నది. ఈ విషయంపై ఎప్పుడో 2005లో కాంగ్రెస్ జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వం హయాంలో నియమితమైన జస్టిస్ సదాశివ కమిషన్ 2012లో తన పని పూర్తి చేసుకొని సదానంద గౌడ ముఖ్యమంత్రిగా వున్న బిజెపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఇప్పుడు దుమ్ము దులిపి అమలు చేయాలని సంకల్పించడంతో ఈ ఆందోళనకు తెర లేచింది. ఈ నివేదికలోని సిఫారసులు తమకు హానికరంగా వున్నాయని భావిస్తున్న బంజారా తదితర స్పృశ్య (అంటదగిన) ఎస్‌సి కులాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనలో భాగంగా బంజారాలు శివమొగ్గ జిల్లాలో గల షికారిపురలోని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప నివాసంపై దాడికి సమకట్టారు. షికారిపుర బస్టాండ్ యెడియూరప్ప ఇంటి వరకు సాగిన ప్రదర్శనలోని వారు దారిలో ఎదురైన జి20 భేటీకి సంబంధించిన బ్యానర్‌పైకి చెప్పు విసిరారు. బంజారాల ఓట్లతోనే యెడియూరప్ప ఇంత పెద్ద నాయకుడయ్యాడని ఇప్పుడు తమకు మోసం చేశాడని బంజారాల నాయకుడొకరు ఆరోపించారు. కర్నాటకలో 101 ఎస్‌సి కులాలున్నాయి. దేశంలో వేరెక్కడా లేని విధంగా అంటరాని కులాల కిందికి రాని బోయ, లంబాడీ, కొరచ, కురుమ వంటి స్పృశ్య కులాలు కూడా ఎస్‌సిలలో వున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం మైసూరు మహారాజా హయాంలో వీరిని ఎస్‌సిలలో చేర్చారు. వారి స్థితిగతులు అంటరాని కులాలతో సమానంగా, దయనీయంగా వున్నందున వారిని ఎస్‌సిలుగా గుర్తించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అదే జాబితాను యథాతథంగా రాష్ట్రపతి ప్రకటన ద్వారా కర్నాటక ఎస్‌సిలుగా గుర్తించారు. బంజారా తదితర అంటదగిన కులాలను ఎస్‌సిలలో పైవర్గాలుగా గుర్తించి ఎస్‌సి లెఫ్ట్ వర్గంగా నిర్ణయించారు. అంటరాని కులాలను కూడా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కులాలుగా విభజించారు. మాదిగ తదితర 29 కులాలను లెఫ్ట్ వర్గంగా, హోలెయ (మాల) మున్నగు 24 కులాలను రైట్ అంటరాని వర్గంగా పరిగణించారు. గతంలో 15 శాతంగా వుండిన ఎస్‌సి రిజర్వేషన్లను 17 శాతానికి పెంచారు. వాస్తవానికి ఎస్‌సిల రిజర్వేషన్లను వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ మేరకు ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం వరకే దాని అధికారాలు పరిమితమై వున్నాయి.

అందుచేత జస్టిస్ సదాశివ కమిషన్ నివేదికను ఆదరాబాదరాగా బయటికి తీసి అమలు పరుస్తున్నామని ప్రకటించవలసిన అవసరం ఇప్పుడు బొత్తిగా లేదు. ఎస్‌సిల ఓటు బ్యాంకును ఆకట్టుకోడం కోసమే బొమ్మై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని బోధపడుతున్నది. ఎస్‌సిల రిజర్వేషన్లను అంతర్ వర్గీకరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అందుకు తగిన సవరణను చట్టాన్ని తీసుకు రావలసి వుంది. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషా మెహ్రా కమిషన్ ఎస్‌సి కోటాను ఎస్‌సిల్లోని అన్ని కులాలకు అందేలా విభజించవలసిన అవసరాన్ని 2008లో నొక్కి చెప్పింది. ఆ మేరకు రాజ్యాంగం 341 అధికరణను సవరించాలని సిఫారసు చేసింది. దేశంలో మొట్టమొదటగా 1976లో పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఎస్‌సి కోటా వర్గీకరణ చేసింది. 1994లో హర్యానా అదే పని చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నడిచిన ఎ, బి, సి, డి ఉద్యమం తెలిసిందే.

2000 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా వర్గీకరణను అమల్లోకి తెచ్చింది. దానిని హైకోర్టులో సవాలు చేయగా అక్కడ ధర్మాసనం ఆ చట్టాన్ని ధ్రువపరిచింది. అయితే సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టి వేసింది. కేంద్రంలోనూ, కర్నాటకలోనూ బిజెపి ప్రభుత్వాలే వున్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా అక్కడ ఎస్‌సి కోటా వర్గీకరణను జరిపించవచ్చు. కాని అది జరగడం లేదు. కర్నాటకలో ఎస్‌సిల ఓట్లు కాంగ్రెస్, బిజెపిల మధ్య చీలి వున్నాయి. కేంద్రం దృష్టిలో యెడియూరప్ప ప్రతిష్ఠ పెరుగుతున్నందున ఆయనను అప్రతిష్ఠ పాలు చేయడానికే ఆయన ఇంటిపై దాడి జరిపించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తాను కేంద్రంతో ప్రస్తావిస్తానని యెడియూరప్ప ప్రకటించారు. బలమైన లింగాయత్ కులానికి చెందిన యెడియూరప్పను ఎన్నికల ముందు వాడుకొని ఆ తర్వాత వదిలేయడం కేంద్రంలోని బిజెపి నేతలకు అలవాటే. ఎస్‌సిల వర్గీకరణ అంతటా వున్న సమస్య. పైనున్న కులస్థులకే రిజర్వేషన్లు అందుతున్నాయన్న అసంతృప్తితో వున్న ఉప కులాలు వర్గీకరణను కోరుతున్నాయి. ఎప్పటికైనా దీనికి సరైన పరిష్కారం కనుక్కోవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News