Tuesday, March 25, 2025

ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద బిసి పోరుగర్జన

- Advertisement -
- Advertisement -

పార్లమెంటులో బిసి రిజర్వేషన్ బిల్లులు ఆమోదించాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిసి బిల్లులను ఆమోదించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు చట్టబద్ధతకు సహకరించిన బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం పొందేందుకు కూడా తగిన సహకారం అందించాలని కోరారు. పోరాటం గల్లీలో ముగిసింది, ఇక డిల్లీలో చేపడుతున్నామని ప్రకటించారు. బిసి ముస్లింలను సాకుగా చూపించి బిల్లును ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యోచిస్తోందని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

ఒకవేళ పెండింగ్‌లో పెడితే కేంద్ర ప్రభుత్వానికి బిసి సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుకు మద్దతునిచ్చిన బిజెపి ఢిల్లీలో ఇవ్వమని అంటున్నారని, రెండు నాల్కల ధోరణి ఎందుకని ఆయన ప్రశ్నించారు. మహిలా బిల్లులో బిసి మహిళలకు ఎందుకు కెటాయించడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 2లోగా పార్లమెంటులో బిసి బిల్లును ఆమోదించాలని, లేనిపక్‌షంలో ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది బిసిలతో పోరు గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. 29 రాష్ట్రాల నుండి లక్షలాది మందితో బిసి దండు ఢిల్లీని ముట్టడించబోతోందన్నారు. కేంద్రం ద్వంద్వ విధానాలు పాటిస్తే అక్కడ అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఛలో ఢిల్లీ పోస్టర్లను జాజుల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేశ్ చారి, కనకాల శ్యామ్ కురుమ, మణిమంజరి, సాగర్, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News