హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గౌడ, ఎస్సి, ఎస్టిలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ లకు 15 శాతం (363),ఎస్సి లకు 10 శాతం (262), ఎస్టి కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం సోమవారం కేటాయించడం జరిగిందని తెలిపారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన గౌడ ,ఎస్సి, ఎస్టి కులాలకు లాటరీ ద్వారా నిర్వహించిన మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ ఎస్సి ఎస్టి కమ్యూనిటీలకు 756 దుకాణాలు కేటాయింపు చేసినట్లు తెలిపారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. గౌడ, ఎస్సి, ఎస్టిలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని ప్రశంసించారు. గతంలో నీరా పథకం తీసుకువచ్చి గౌడ్ లకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సోమవారం మద్యం దుకాణాలనుపైన తెలిపిన కమ్యూనిటీలకు లాటరీ ద్వారా కేటాయించారని వెల్లడించారు. ఈ విడత షాపుల యజమానులకు వెసులుబాటు కల్పించామని, ముఖ్యంగా గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వవలసి ఉండగా, ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకోవడం జరుగుతుందని, దరఖాస్తు ఫీజు ,లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదని, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక లతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని, ప్రివిలన్స్ ఫీజు కూడా ఏడింతలనుండి పదింతలు చేశామని, లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుండి 12 కి పెంచామని శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో ఒకరు ఒక్క షాపుకు మాత్రమే పాడుకునేందుకు పరిమితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితి లేదని తెలిపారు. రాష్ట్రంలో గుడుంబాను ఉక్కు పాదాంతో అణచి వేస్తామని, అదేవిధంగా గంజాయిని కూడా అరికడతామని, గంజాయి పండించడం, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై పిడియాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ మద్యాన్ని 100% నియంత్రిస్తామని మంత్రి తెలిపారు. గతంలో యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు మంచివి ఉచితంగా ఇవ్వడం జరిగిందని, ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే తమ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకులాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా గౌడ ఎస్ సి,ఎస్ టి కమ్యూనిటీ వారి ద్వారా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 90 ఉండగా వాటిలో రిజర్వేషన్ ప్రకారం ఎస్ టి లకు 3, ఎస్ సి లకు 10, గౌడ లకు 14 కేటాయించగా, తక్కినవి ఓపెన్ కేటగిరీలో ఇవ్వనున్నారు. అనంతరం మంత్రి సుమారు 23 మంది నూతనంగా నియమించబడిన ఎఎన్ఎంలకు నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, సిఐ బాలకృష్ణ, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిరా,డి టి డి ఓ చత్రు, ఎస్ సి అభివృద్ధి అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.