Thursday, January 23, 2025

బంగ్లాలో రిజర్వేషన్ల చిచ్చు

- Advertisement -
- Advertisement -

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రిజర్వేషన్లను సంస్కరించి, ప్రతిభకు పట్టం కట్టాలన్న డిమాండ్‌తో రెండువారాల క్రితం విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి సాధారణ ప్రజాజీవనానికి పెను విఘాతంగా పరిణమించింది. శాంతియుతంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళన ఒక్కసారిగా అదుపు తప్పి, హింసాత్మకంగా మారడంతో పరిస్థితి చేజారింది. ఫలితంగా వందలాది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అటు విద్యార్థులు, ఇటు ప్రభుత్వమూ తమదే పైచేయి కావాలన్న ధోరణితో మొండిపట్టు ప్రదర్శిస్తుండటంతో రానురాను ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం రావణకాష్టంలా మారే ప్రమాదం కనబడుతోంది.

బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి పిల్లలకు, వారి మనవళ్లు, మనవరాళ్లకు 30 శాతం రిజర్వేషన్లు దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. అప్పటి దేశాధ్యక్షుడు ముజిబుర్ రహ్మాన్ 1972లోనే ఈ రిజర్వేషన్లు కల్పించారు. ఈమేరకు విముక్త పోరాటంలో అసువులు కోల్పోయిన వేలాది మంది సంతానానికి ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటికితోడుగా స్థానిక పరిపాలన జిల్లాలవారికి 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనారిటీ తెగలవారికి ఐదు శాతం, దివ్యాంగులకు ఒక శాతం రిజర్వేషన్లను తర్వాతి ప్రభుత్వాలు జత చేశాయి. దీంతో రిజర్వేషన్ల శాతం 56కు చేరింది. ఈ పద్ధతిపై గతంలోనూ ఎన్నోసార్లు నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

పర్యవసానంగా ప్రధాని హసీనా 2018లో రిజర్వేషన్లను రద్దు చేశారు. అయితే మొన్న జూన్‌లో స్వాతంత్య్ర సమరయోధుల సంతానానికి రిజర్వేషన్లు కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో మళ్లీ చిచ్చు రాజుకుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా మొక్కగా ఉండగానే ఉద్యమాన్ని తుంచివేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆమె అవలంబిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది. నిరసనకారులపైకి పోలీసులను, పారా మిలిటరీ బలగాలను ఉసిగొల్పి, పరిస్థితి మరింత జటిలం కావడానికి ఆమె ఆజ్యం పోస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో కర్ఫ్యూ విధించడంతోపాటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని నిరసిస్తూ ‘స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలకు కాకుండా రిజర్వేషన్లను రజాకార్ల (విముక్త పోరాటంలో పాకిస్తాన్‌కు మద్దతు పలికినవారు)కు ఇవ్వాలా?’ అంటూ హసీనా చేసిన వెటకారపు వ్యాఖ్యలు కూడా ఉద్యమాన్ని ఎగదోశాయని చెప్పవచ్చు.

అధికార అవామీలీగ్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు రిజర్వేషన్ల కోటాను సమర్ధిస్తూ, నిరసనకారులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఒకవైపు పోలీసులు, మరోవైపు అధికార పార్టీకి చెందిన విద్యార్థి గ్రూపులు తమపై విరుచుకుపడుతున్నా ఉద్యమకారులు వెనక్కు తగ్గడం లేదు సరికదా హింసాత్మక విధానాలకు దిగుతున్నారు. మీడియా సంస్థలకు, పోలీస్ స్టేషన్లకూ నిప్పుపెట్టి, ప్రభుత్వానికి సవాల్ విసరుతున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ వందమందికి పైగానే విద్యార్థులు కన్నుమూసినట్లు అంచనా. చేజారుతున్న పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి, విద్యార్థి సంఘ నేతలను చర్చలకు ఆహ్వానించింది. అయితే తుది నిర్ణయం సుప్రీం కోర్టు చేతుల్లోనే ఉంటుందని అనడంతో ఉద్యమ నేతలు చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ ఒకటి. విపరీతంగా పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువతలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వేషన్లు తమ పాలిట శాపంగా పరిణమించాయన్న భావన యువతలో బలంగా నాటుకుపోయింది. ఉపాధిని వెతుక్కుంటూ బంగ్లా యువత అటు చైనాకు, ఇటు ఇండియాకు వలసపోతున్నారు.

అయితే విద్యార్థులు యావత్తు రిజర్వేషన్ల వ్యవస్థను వ్యతిరేకించకపోవడం గమనార్హం. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు, వారి పిల్లలకూ ఇస్తున్న రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. సమరయోధుల పేరిట రూపొందిన జాబితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్నది కూడా వారి ఆరోపణల్లో ఒకటి. వారికి ఇస్తున్న 30 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది విద్యార్థుల ప్రధాన డిమాండ్. విద్యార్థుల ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం కోటా అమలును నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో దండోపాయంతో విద్యార్థులను లొంగదీసుకోవాలనుకుంటున్న హసీనా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులలో పరిష్కారమార్గం కనుగొనేందుకు ప్రయత్నించడం శ్రేయస్కరం. మరింత మంది అమాయకుల ప్రాణాలు బలికాకుండా చూడవలసిన బాధ్యత బంగ్లా ప్రభుత్వంపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News