అవి మన రాజ్యాంగం రూపశిల్పి అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం
కర్నాటకలో ప్రభుత్వ కాంట్రాక్టులో ముస్లింలకు కోటాపై ఆర్‌ఎస్‌ఎస్
బెంగళూరు : ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కర్నాటక ప్రభుత్వం నిర్ణయంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో మతం ఆధారిత కోటాను రాజ్యాంగం అనుమతించదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె ఆదివారం స్పష్టం చేశారు. అటువంటి రిజర్వేషన్లు మన రాజ్యాంగం రూపశిల్పి బిఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకమైనవేనని కూడా ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సదస్సు ముగింపు రోజు విలేకరులతో హొసబలె మాట్లాడుతూ, ‘మతం ఆధారిత రిజర్వేషన్‌ను బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆమోదించడం లేదు.
ఆ పని చేస్తున్నవారు ఎవరైనా మన రాజ్యాంగం రూపశిల్పికి వ్యతిరేకంగా వెళుతున్నట్లే’ అని వ్యాఖ్యానించారు. ముస్లింల కోసం మతం ఆధారిత రిజర్వేషన్లను ప్రవేశపెట్టేందుకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర చేసిన యత్నాలను హైకోర్టులు, సుప్రీం కోర్టు తోసిపుచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. అటువంటి కోటా కోసం నిబంధనలను కోర్టులు తిరస్కరించాయని హొసబలె స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 17వ శతాబ్దపు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై వివాదం గురించిన ప్రశ్నకు హొసబలె సమాధానం ఇస్తూ, ఔరంగజేబును ఒక ఐకన్‌ను చేశారని, సామాజిక సామరస్యంలో విశ్వాసం ఉన్న అతని సోదరుడు దాడా షికోహ్‌ను అలా చేయలేదని చెప్పారు.
భారత విలువలకు వ్యతిరేకంగా సాగిన వారిని ఐకన్‌లను చేశారని ఆయన ఆరోపించారు. బ్రిటిష్‌వారిని ప్రతిఘటించినవారిని కాకుండా వారిపై పోరాడినవారిని స్వాతంత్య్ర యోధులుగా పేర్కొన్నారని కూడా ఆయన అన్నారు. మొగల్ చక్రవర్తి అక్బర్‌పై పోరాడినందుకు రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాన్ వంటి ప్రముఖులను హొసబలె కొనియాడారు. ‘ఆక్రమణ మనస్తత్వం’తో ఉన్నవారు భారత్‌కు ముప్పు కలిగిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ నేత అన్నారు. ‘భారతీయ విలువలను మన్నించేవారికి మనం దన్నుగా ఉండాలి’ అనిహొసబలె సూచించారు.