Friday, December 20, 2024

ఈ తీర్పు ఒక హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

కుల గణనతో బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది విద్య, ఉద్యోగ రంగాల్లో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు 65 శాతానికి పెంచుతూ అమలులోకి తీసుకొచ్చిన నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేయడం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టిదెబ్బ. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కులగణనతో రిజర్వేషన్లు పెంచేందుకు బీహార్ ప్రభుత్వం తరహాలో సన్నాహాలు చేస్తున్న పార్టీలకు, ప్రభుత్వాలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. కులగణన నివేదికను గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో బీహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అదే సమయం లో విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లు తీసుకు రావడం, సభ ఏకగ్రీవంగా ఆమోదించడం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం ఇవన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. అయితే ఈ రిజర్వేషన్ పెంపుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం గమనార్హం. బీహార్ ఒక్కటే కాదు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక వర్గానికి పరిధి మించి రిజర్వేషన్ పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం, వాటిని కోర్టులు రద్దు చేయడం అనుభవమౌతూనే ఉన్నాయి. ‘రిజర్వేషన్ల అవసరం పదేళ్లు మాత్రమే ఉంటుందని రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ గతంలో వెల్లడించారు. పదేళ్లలో సమాజం అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు. కానీ తరువాత ఏం జరుగుతోంది? కులాలు, వర్గాలు, మతాల పేరిట ప్రతి పదేళ్లకు రిజర్వేషన్లు డిగిస్తూనే పాలకవర్గాలు ముందుకుపోతున్నాయి.

దీని పర్యవసానాలు ఏమిటో ఆలోచించడం లేదు’ అని 2018లో అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ‘ రిజర్వేషన్లు మూడు రకాలు. రాజకీయ రిజర్వేషన్ (రిజర్వుడు నియోజక వర్గాలు), చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితి విధించలేదని ప్రొఫెసర్ హరినార్కే పేర్కొన్నారు. రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో పదేళ్ల కాలపరిమితికి అంబేద్కర్ విముఖత చూపారని నార్కే వివరించారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు 20% రిజర్వేషన్ చేయాలని 1954 లోనే సూచన మొదలైంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితిని అంచనా వేయడానికి 1979లో మండల కమిషన్ అంటే సామాజికంగా, విద్యాపరంగా, వెనుకబడిన తరగతుల (ఎస్‌ఇబిసి) కమిషన్ ఏర్పాటైంది.

దీంతో గణనీయమైన మార్పు వచ్చింది. అనేక పరిణామాల తరువాత రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిధి మించితే రాజ్యాంగం కల్పించిన సమాన ప్రాప్తి ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగం సవరణతో 50% మించిపోయింది. ఈ పరిమితిని మించి చట్టాలు చేసిన రాష్ట్రాల వ్యాజ్యాలు సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంటున్నాయి. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రంలో కులఆధారిత రిజర్వేషన్ 69 శాతంగా ఉంది. హర్యానాలో 2021లో స్థానిక అభ్యర్థులకు రూ. 25,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం చట్టాన్ని అమలు లోకి తేగా పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ చట్టాన్ని 2023లో రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు 2012లో రిజర్వేషన్లు 50% నుంచి 58 శాతానికి పెంచారు.

ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఆ తరువాత 2018 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక 2019 ఆగస్టు 15న కొత్త రిజర్వేషన్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఎస్‌సిలు, ఒబిసిలు అన్ని రిజర్వేషన్లు కలుపుకుని మొత్తం 82 శాతానికి చేరింది. 2022లో చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు రిజర్వేషన్లపై తీవ్ర తరంగా ఆందోళనలు కొనసాగించగా, అప్పటి ప్రభుత్వం తలొగ్గి 82 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను చత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసింది.ఆ తరువాత పాత రిజర్వేషన్ వ్యవస్థను కూడా రాజ్యాంగ విరుద్ధమంటూ 2022 సెప్టెంబరులో తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News