మన తెలంగాణ/మోత్కూరు: అగ్రవర్ణ పేదల లెక్కలు తేల్చకుండా పదిశాతం ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని, ఆ లెక్కలు తేల్చిన తరువాత రిజర్వేషన్లు అమలు చేయాలని బిసి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ కోరారు. మంగళవారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రవర్ణ పేదలకు తాము వ్యతిరేకం కాదని, అణగారిన వర్గాలు సామాజిక సమానత్వం సాధించడానికే రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం విచారకరమని, రిజర్వేషన్లు మార్చే ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా జరగడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రిజర్వేషన్లపై బిసి సంఘాల నాయకులు ఏకతాటి పైకి వచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్సగిరి, జినుకల కృష్ణ, పోతరబోయిన నర్సింహ పాల్గొన్నారు.