Wednesday, January 22, 2025

ఐఫోన్ కోసం రిజర్వాయర్ ఖాళీ: ఓ ప్రభుత్వాధికారి నిర్వాకం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

రాయపూర్: నీటిలో పడిపోయిన తన ఐఫోన్‌ను వెలికితీసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఒక రిజర్వాయర్‌ను ఏకంగా లో ఖాళీ చేయించాడు. రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న 21 లక్షల లీటర్ల నీటిని తోడేయించడంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ అధికారిని సస్పెండ్ చేసింది. అయితే..ఖరీదైన ఆ ఫోన్‌ను వెలికితీసేందుకు రిజర్వాయర్ నీటిని తోడేయడానికి మౌఖికంగా అనుమతి ఇచ్చిన అతడి సీనియర్ అధికారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేసింది.
వేసవి కాలంలో వ్యవసాయానికి, ఇతర అవసరాల కోసం ఉపయోగపడే నీటిని వ్యర్థంగా పారబోసినందుకు ఆ నీటి విలువను జీతం నుంచి ఎందుకు మినహాయించకూడదో తెలియచేయాలని సబ్ డివిజన్ అధికారి ధీవర్‌కు ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ నోటీసు పంపించారు.

Also Read: మత స్వేచ్ఛకు సురవరం మద్దతు

ఖేర్‌కట్టా డ్యాంకు చెందిన పరల్‌కోట్ రిజర్వాయర్ వద్దకు విహార యాత్ర నిమిత్తం వెళ్లిన ఫుడ్ ఆఫీసర్ ఒకరు తన స్నేహితులతో కలసి సెల్ఫీ తీసుకుంటుండగా రూ 1 లక్ష విలువచేసే ఆయన ఐఫోన్ నీటిలో పడిపోయింది. స్థానిక గజ ఈతగాళ్లు నీటిలో ఎంత వెతికినా ఫోన్ దొరకలేదు. దీంతో తన పైదికారికి చెప్పి ఆయన అనుమతితో 30 హెచ్‌పితో కూడిన రెండు డీజిల్ పంపులతో నీటిని తోడేయించాడు. నిరంతరాయంగా 3 రోజులపాటు మోటారు పనిచేసి 21 లక్షల లీటర్ల నీటిని తోడించాడు. ఆ నీటితో 1500 ఎకరాల పొలాలను తడపవచ్చని అధికారులు చెప్పారు.

ఆ ఐఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఆఫీసు సమాచారం ఉందని, అందుకే ఈ వ్యర్థమైన నీటిని తోడించానని ఆ ఫుడ్ ఆఫీసర్ సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఎండాకాలంలో 10 అడుగుల లోతున ఉండే ఈ రిజర్వాయర్ నీరు స్థానిక రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇంద్రావతి ప్రాజెక్టు ఎస్‌ఇ చెబుతున్నారు. కాగా..ఐదు అడుగుల వరకు నీటిని ఉంచాలని తాను చెప్పానని సబ్ డివిజనల్ అధికారి తెలిపారు. మొత్తమ్మీద 21 లక్షల లీటర్ల నీటిని తోడిన తర్వాత లభించిన ఆ ఐఫోన్ మాత్రం మూడు రోజులు నీటిలో నాని ఉండడంతో పని చేయక పోవడం కొసమెరుపు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News