హైదరాబాద్: గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. సిఎం కెసిఆర్ అన్ని రంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చారని, రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదన్నారు. సంత్‌సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, తండాలను పంచాయతీలుగా చేశామన్నారు. మారుమూల గిరిజన తండాలకు కూడా మిషన్ భగీరథ నీరు ఇస్తున్నామని ప్రశంసించారు. గత పాలకుల హయాంలో గిరిజనులు నిర్లక్ష్యం చేయబడ్డారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల అభివృద్ధికి కృషి చేశామన్నారు. త్వరలో పోడు భూముల సమస్యలను సిఎ కెసిఆర్ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తలసాని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బంజారాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.