Monday, January 20, 2025

కాంగ్రెస్లో కల్లోలం

- Advertisement -
- Advertisement -

మైనంపల్లి చేరికతో అంతా ఆగమాగం

మొన్న మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షుడి రాజీనామా

నిన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి గుడ్‌బై

అధిష్ఠానానికి లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్:  మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షుడు కె.తిరుపతి రెడ్డి రాజీనామా చేయగా సోమవారం మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాజీనామా చేయడం గమనార్హం. వీరితో పాటు మరికొందరు వారి అనుచరులు సోమవారం తమ రాజీనామాలను టిపిసిసితో పాటు అధిష్టానానికి పంపించారు. మొదటినుంచి మైనంపల్లి చేరికను ఆయా జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు వ్యతిరేకిస్తుండగా అధిష్టానం మాత్రం మైనంపల్లిని పార్టీలో చేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా మైనంపల్లికి రెండు సీట్లు ఇస్తామని పేర్కొనడంతో ఈ రెండు జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మొదటినుంచి టార్గెట్ చేసిన మైనంపల్లి తమపై అక్రమ కేసులను బనాయించి ఇబ్బందులు పెట్టారని , అలాంటి వ్యక్తిని పార్టీలో తీసుకోవడంతో పాటు రెండు సీట్లు ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామాలను అధిష్టానానికి పంపిస్తున్నారు.

బిసిలకు కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదు:నందికంటి శ్రీధర్
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నందికంటి శ్రీధర్
సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. ఈ సందర్భంగా శ్రీధర్ ఖర్గేకు పంపించిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని, రాహుల్ గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్‌లో ఒక్క ఇంటికి ఒక్కటే టికెట్ ఇస్తామని చెప్పారని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం మైనంపల్లి హనుమంత రావుకు మల్కాజగిరి సీటుతో పాటు ఆయన కుమారుడికి మెదక్ సీట్ ఎలా ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలకు కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి టికెట్ ఇస్తారా అని ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.

వెయ్యిమంది కార్యకర్తలతో రహస్య భేటీ
నందికంటి శ్రీధర్ సోమవారం మౌలాలి క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది పైగా ముఖ్య కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని తల్లిలా భావించానని, కానీ, ఆ తల్లే నన్ను మోసం చేసిందని నందికంటి శ్రీధర్ కంటతడి పెట్టుకున్నట్టుగా తెలిసింది. 1994 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా తనకు గుర్తింపు లేదని, ఈసారి టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బిసిలకు ప్రాధాన్యత దక్కడం లేదని కూడా ఆయన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. గత ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి లేదా పోటీ చేసిన బిసి కమ్యూనిటీ నాయకులకు అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందని ప్రస్తుతం ఆ హామీని పార్టీ విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అందుకే డిసిసి అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అనుచరులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. తామంతా నీవెంటే ఉంటామని శ్రీధర్ అనుచరులు ఆయన్ను ఓదార్చినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News