తిరువనంతపురంలో కేంద్ర హోం
19అంశాల అజెండాను సమర్పించిన రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గడచిన ఏడేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విభజన సమస్యలు, నదీ జలాల వివాదాలు పరిష్కారం కాకపోవడం, తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రంతో ఉన్న వివాదాలు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చాలని గడచిన ఏడేళ్ళుగా కోరుతూ వస్తున్నప్పటికీ ఏఒక్క సమస్యనూ కేంద్రం పరిష్కరించకపోవడంతో కేం ద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రభుత్వవర్గాలు ఆక్షేపిస్తున్నాయి.
శనివారం కేర ళలోని తిరువనంతపురంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రాధమిక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పాల్గొన్న ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు సుమారు 19 అంశాలతో కూడిన ఎజెండాను అందజేసినట్లు తెలిసింది. ఈ ఎజెండాలోని అంశాలనే గత ఏడేళ్ళుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇతర సీనియర్ మంత్రులకు స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇతర మంత్రులు హరీష్‌రావు, కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి తదితర మంత్రులు, అధికారులతో కలి సి అనేక విన్నపాలు, వినతిపత్రాలను సమర్పించినప్పటికీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడంతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశాలన్నీ మొక్కుబడిగానే, కాలయాపన కోసం, కేంద్ర ప్రభుత్వం తమ రికార్డుల కోసం నిర్వహిస్తున్న సమావేశాలు మాత్రమేనని, ఇందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదని కూడా కొందరు సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకుంటే కేంద్ర హోంశాఖ అధికారికంగా నిర్వహించే సమావేశాలు కావడంతో వెళ్ళివస్తున్నామని వారు అంటున్నారు.
ఆగస్టు నెలలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా అధ్యక్షతన మరోసారి సదరన్ జోనల్ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో ఎజెండాలోని అంశాలపై చర్చలు జరుగుతుండవచ్చునని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సదరన్ జోనల్ సమావేశానికి హాజరైన రామకృష్ణారావు బృందం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని కోరింది. అదే విధంగా తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఉద్యానవన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయాలని, ఖమ్మం జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్ధంతో ఎన్.టి.పి.సి.(నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్) విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, పోలవరం ప్రాజెక్టు మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిరక్షించాలని, పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి గోదావరీ నదీ జలాలను కృష్ణానదీ ఆయకట్టుకు తరలిస్తున్నందున తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటాను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఇలా మరికొన్ని అంశాలతో కలుపుకొని మొత్తం 19 అంశాలపైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక, జల్‌శక్తి మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారని, దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన అధికారుల నుంచి సుమారు 89 అంశాలపైన చర్చించేందుకు వీలుగా సమస్యల చిట్టాలను కేంద్ర హోంశాఖ ముందుంచారని ఆ అధికారులు వివరించారు. ఈ సమావేశానికి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.