Thursday, January 23, 2025

పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
పలువురు కేంద్ర కార్యదర్శులను కోరిన సి.ఎస్.శాంతి కుమారి

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కోరారు. సోమవారం న్యూఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ , కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి అనుమతులను జారీ చేయాలన్నారు.

ప్యారడైస్ జంక్షన్ నుండి కండ్ల కోయ ఓఆర్‌ఆర్ వరకు, ప్యారడైజ్ నుండి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్‌ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి, అదే విధంగా మెహదీపట్నం జంక్షన్‌లో ప్రతిపాదిత స్కై- వాక్ నిర్మాణ పనులకు అవసరమైన 150.39 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ను కోరారు. రక్షణ శాఖ భూములకు సరిపడా ప్రత్యామ్నాయ భూములను కూడా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి స్పందిస్తూ ఈ విషయంలో సంబంధిత వివరాలను తెప్పించుకొని త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్‌ను కలిసి జాతీయ వన్య ప్రాణి సంరక్షణ బోర్డులో పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబందించిన 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలుపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, పీ.ఎం.జీ.ఎస్.వై పనులకు సంబందించి త్వరిత గతిన అటవీ శాఖ అనుమతులు ఇవ్వడానికి నేషనల్ బోర్డు ఫర్ వైల్ లైఫ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో సమావేశమై రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సి.ఎస్ శాంతి కుమారి తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, తెలంగాణా భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News