Monday, November 18, 2024

రిసార్టుల రాజకీయం

- Advertisement -
- Advertisement -

గతంలో (1984 ఆగస్టు) ఎన్‌టి రామారావు గుండె చికిత్స కోసం అమెరికా వెళ్ళగా కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గద్దె దించి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పొడిచి చంపిన ఉదంతం తెలిసిందే. ఆ జుగుప్సాకరమైన ఉదంతం అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్ మహాశయుని దర్శకత్వం లో జరిగింది. ఆ తర్వాత సంభవించిన పరిణామాల్లో ఎన్‌టిఆర్ తన పార్టీ శాసన సభ్యులను కర్నాటకకు తీసుకెళ్లి అక్కడి రిసార్టుల్లో దాచి ఉంచడమూ ఎరుకే. కేంద్రంలోని పాలక పక్షాల బాహాటమైన వెన్నుదన్నుతో రాష్ట్రాల్లో ప్రజల తీర్పుకి పట్టపగలే తూట్లు పొడిచే నిర్వాకం మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో అధికార శివసేనను చీల్చి శాసన సభ్యులను గుజరాత్‌కు, అసోమ్‌కు తీసుకుపోయి దాచిపెట్టిన సందర్భంలో మరింత రక్తి గట్టింది. ఇప్పుడు ఇదే రిసార్ట్ రాజకీయం జార్ఖండ్, బీహార్‌లలో చోటు చేసుకొన్నది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 8 ఎకరాల భూమిని తన పేరిట అక్రమంగా బదలాయింప జేసుకొన్నాడన్న ఆరోపణపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) ఆయనను పెట్టిన ముప్పుతిప్పలు కళ్ళ ముందున్నవే.

చివరికి ఆయన రాజీనామా చేసేలా చేసి అరెస్టు చేసేంత వరకు నిద్రపోలేదు. హేమంత్ రాజీనామా తర్వాత అధికార కూటమి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ కలిగినప్పటికీ చంపయ్ సోరెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ ఒక రోజు ఆలస్యం చేశారు. దానితో పాలక కూటమి బలపరీక్ష జరిగే వరకు తన ఎంఎల్‌ఎలను హైదరాబాద్‌లో దాచి ఉంచక తప్పలేదు. బీహార్‌లో నితీశ్ కుమార్ మళ్ళీ మరొక్కసారి రాజకీయ విధేయతను మార్చుకొని మహాఘట్‌బంధన్ నుంచి ఎన్‌డిఎ కూటమికి ఫిరాయించిన పిమ్మట వెనువెంటనే ఆయన చేత తిరిగి ప్రమాణ స్వీకారం చేయించి ఆయన కొత్త ప్రభుత్వ బలపరీక్ష తేదీని దూరం దూరం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆర్‌జెడి కూటమిలోని కాంగ్రెస్ శాసన సభ్యులను కాపాడుకోడం కోసం హైదరాబాద్ రిసార్టుల్లో ఉంచారు. ప్రజల తీర్పును జుట్టు పట్టుకొని రిసార్టులకు ఈడ్చే ఈ దౌర్భాగ్యం కూడా భారత స్వాతంత్య్ర శతాబ్ది 2047 వరకూ కొనసాగి వికసిత్ భారత్ అంటే అదేనని ఇల్లెక్కి చాటడం ఖాయమనిపిస్తున్నది. లేక పాకిస్తాన్‌లో ఎన్నికల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదార్లను సైన్యం ఆదేశాలతో పోలీసులే హింసలకు గురిచేస్తున్న మాదిరిగా మన దేశంలో కూడా అప్పటి కేంద్ర పాలక పక్షం గవర్నర్ల ద్వారా ముఖ్యమంత్రులను మార్పించే విధానం శాసనబద్ధం అవుతుందేమో!

హేమంత్ సోరెన్ అన్నట్టు పార్లమెంటు సభ్యులను, రాష్ట్రపతులను సైతం ఇడి చేత అరెస్టు చేయించే రోజులు దాపురిస్తాయేమో, ప్రజాస్వామ్య భవనాన్ని కూల్చడం ప్రారంభించిన తర్వాత అది ఒక చోట ఆగుతుందా? జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నాడు జరిగిన విశ్వాస పరీక్షలో కొత్త ముఖ్యమంత్రి పంచయ్ సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 మంది, వ్యతిరేకంగా 29 మంది శాసన సభ్యులు ఓటు వేశారు. ఒక ఇండిపెండెంటు సభ్యుడు ఓటింగ్‌లో పాల్గొన లేదు. మొత్తం శాసన సభ బలం 81. బలపరీక్ష ఘట్టం పాలక కూటమికి హేమంత్ సోరెన్ పట్ల గల విధేయతను చాటింది. ముఖ్యమంత్రి చంపయ్ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ చేసిన ప్రసంగాన్ని ‘హేమంత్ సోరెన్ తమకు దన్నుగా ఉంటే చాలు ధైర్యంగా ముందుకు పోతాం అని, హేమంత్ ప్రభుత్వం రెండో భాగానికి నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రాన్ని అస్థిర పరచాలనే కుట్రను తమ ఐక్యత భగ్నం చేసిందని పంచయ్ సోరెన్ x లో ప్రకటించారు. తనపై ఆరోపణలను రుజువు చేస్తే జార్ఖండ్‌ను విడిచిపెడతానని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సవాలు చేశారు.

రాజ్‌భవన్ ప్రోద్బలంతోనే ఒక ముఖ్యమంత్రిని ఇలా అరెస్టు చేశారని, గిరిజనులను బిజెపి అంటరానివారుగా చూస్తున్నదని డా. అంబేడ్కర్ మాదిరిగానే వారు బుద్ధిజాన్ని స్వీకరించక తప్పనిస్థితి తల ఎత్తుతున్నదని కూడా అభిప్రాయపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ సంవత్సరాంతంలోగా జరగవలసి ఉంది. ఈ కొద్ది కాలానికే ముఖ్యమంత్రిని బలవంతంగా దింపి అరెస్టు ద్వారా అప్రతిష్ఠపాలు చేయడంలో కేంద్ర పాలకుల కుట్రే కనిపిస్తున్నదన్న విమర్శ తోసిపుచ్చదగినదిగా కనిపించడం లేదు.ఢిల్లీ నుంచి రాంచీ వరకు హేమంత్ సోరెన్‌ను ఇడి వేటాడి, వెంటాడిన తీరు సమంజసం అనిపించడం లేదు.ఘోరమైన ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారు బిజెపిలో చేరి సురక్షితంగా ఉండగలుగుతున్న ఉదంతాలున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇడి అడుగుపెట్టలేకపోడంలోనే కేంద్ర పాలకులు ప్రతిపక్ష నేతలను పనికట్టుకొని రాచి రంపాన పెడుతున్నారని రుజువు అవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News