మన మాతృభాష మన కంటిచూపంత విలువైనదని, మన భావాలను మాతృభాషలోనే వ్యక్తం చేయాలని మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన గుజరాత్ యూనివర్శిటీ 73వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ తన తల్లిని, మాతృభూమిని, మాతృభాషను గౌరవించాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని యువత శ్లాఘించాలని ఆయన కోరారు. ఎందుకంటే ఎవరైనా సరే సత్తా ఉంటే అగ్రస్థానానికి చేరుకునేందుకు ప్రజాస్వామ్యం వీలుకల్పిస్తుందన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం తన యవ్వనంలో వార్తాపత్రికలు వేసేవారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మేవారు. వారంతా కింది స్థాయి నుంచి ఎదిగినవారేనని, తమ కుటుంబాలకు సాయపడ్డవారేనని అన్నారు. తన కుటుంబంలో తానే తొలి పట్టభద్రుడినని వెంకయ్య నాయుడు వివరించారు.
ఇదంతా ప్రజాస్వామ్యం వల్లే సాధ్యమైందన్నారు. మనం కుల, మత విభజనలకు పావులు కావొద్దని, మనమంతా భారతీయులమని, మనలో ఎవరైనా ఎదగాలంటే శీలం, క్యాలిబర్, సమర్థత, సత్ప్రవర్తన చాలా ముఖ్యమన్నారు. అయితే కొంతమంది కులం, సమూహం, ధనం, నేరాలను వాటి స్థానంలో వాడుకుంటున్నారని అన్నారు. ఇదే సందర్భంలో సెల్ ఫోన్లు, హెల్‌ఫోన్లుగా మార్చుకోరాదని ఆయన యువతకు సూచించారు. మాతృభాషను గౌరవించమంటే, ఇతర భాషలను కించపరచమని అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రథమ స్థానం ఇచ్చి, ఇతర భాషలకు తర్వాతి స్థానం ఇవ్వాలన్నారు. ‘దక్షిణ భారత దేశంలో హిందీని మనమీద రుద్దుతున్నారని మాతో అంటున్నారు. రుద్దడం వద్దు, అలాగని వ్యతిరేకతా వద్దు. దేశంలో హిందీని అధికంగా వాడుతున్నారు.మీరు ఇంగ్లీషును కూడా నేర్చుకోండి, తర్వాత ఫ్రెంచ్ వంటి ఇతర భాషలను కూడా నేర్చుకోండి’ అని ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు.