Wednesday, January 22, 2025

ఉపా కేసు ఎత్తివేతతో నైతిక బాధ్యత పెరిగింది : ప్రొఫెసర్ హరగోపాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రొఫెసర్ జి హరగోపాల్‌పై ఉపా కేసును ఎత్తివేస్తున్నట్టుగా తెలంగాణ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఉపా కేసు ఎత్తివేసినట్టుగా పోలీసు సూపరింటెండెంట్ గౌష్ ఆలమ్ తెలిపారు. వారిలో పద్మజా షా, వి రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేష్ కుమార్ ఉన్నారు. తనపై ఉపా కేసు ఎత్తివేయడంపై హరగోపాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉపా కేసు ఎత్తివేతతో నైతిక బాధ్యత పెరిగిందని అన్నారు. మిగిలిన వారిపై కూడా ఉపా కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

వారి హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో ఉపా చట్టం ఉండకూడదని హరగోపాల్ అన్నారు. తెలంగాణలో 400 మందిపై ఉపా కేసులు ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని కేసులు లేవని చెప్పారు. ఈ కేసులన్నింటినీ పరిశీలించాలని కోరారు. దేశంలో ఉపా చట్టం తీసుకొచ్చినప్పుడే చాలా విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే.. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో హరగోపాల్‌తో పాటు 152 మందిపై ఉపా కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి.

మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపా కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ప్రొ.హరగోపాల్‌పై ఉపా కేసు ఉపసంహరించుకోవాలని సిఎం కెసిఆర్ శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీంతో డిజిపి ఈ మేరకు ములుగు ఎస్‌పికి సూచించారు. అయితే మొత్తం 152 మందిలో ఆరుగురిపై పోలీసులు కేసులను ఎత్తివేసినట్లు ములుగు ఎస్‌పి ఆలం ప్రకటించారు. దీనిపై ములుగు పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News