ప్రజాసమస్యల పట్ల కేంద్రంపై వరుస దూకుడు
న్యాయబద్ధమైన ప్రశ్నలతో కేంద్రమంత్రులకు లేఖలు, వరుస ట్వీట్లు
తాజాగా ఆదిలాబాద్‌లో సిమెంట్ కర్మాగారం తెరిపించాలని లేఖ
వెనుకబడిన జిల్లా యువతకు న్యాయం చేయాలని సూచన
రాష్ట్రంలో అద్భుతమైన టిఎస్ఐపాస్ విధానం ఉందని గుర్తు చేసిన మంత్రి
కంపెనీ ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తాం
ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు
మా కృషి వల్లే ఓరియంట్ కంపెనీ దేవాపూర్ ప్లాంట్‌లో రూ.1500కోట్లకుపైగా భారీగా పెట్టుబడులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మరింత దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై గత కొంత కాలంగా కేంద్రానికి వరసగా లేఖలు రాస్తున్నారు. ట్వీట్లతో వేడి పుట్టిస్తున్నారు. కేంద్రాన్ని ఉక్కిరి, బిక్కిరికి గురి చేస్తున్నారు.మొన్న ధాన్యం కొనుగోలు విషయంలోనూ, నిన్న వస్త్ర పరిశ్రమపై విధించిన జిఎస్టి పన్ను శాతం యథాస్థితిలో కేంద్రం కొనసాగే విధంగా చూడడంలో ప్రధాన భూమికను పోషించారు. ఇందుకు కేంద్రం దెబ్బకు దిగి వచ్చి…తదనుగుణంగా చర్యలు తీసుకుంది. అదే వరుసలో కెటిఆర్ తాజాగా కేంద్రానికి మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు ఒక లేఖ రాశారు. ఆదిలాబాద్‌లో సిసిఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని ఆ లేఖలో వివరించారు. సిసిఐ నిర్వహణకు అవసరమైన, విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సిసిఐ టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.
2కెవిఎ విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భౌగోళికంగా ఆదిలాబాద్‌కున్న సానుకూలతను ఉపయోగించుకుని సిసిఐ యూనిట్ పునఃప్రారంభిస్తే రాష్ట్ర అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. ప్రధానంగా వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాల్లో సిసిఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సిసిఐ కంపెనీని తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్‌కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో టిఎస్…ఐపాస్ వంటి అద్భుతమైన విధానం రూపొందించామని కెటిఆర్ వివరించారు. తమ నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.
తమ ప్రయత్నాలు ఫలించి ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు సైతం నూతన పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఒరియంట్ సిమెంట్ తన దేవాపూర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు సుమారు రూ.1500 కోట్ల (215 మిలియన్ డాలర్లు) పైగా భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం దూకుడు మీదున్నదని, భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత పురోగతి సాగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడ సిమెంటుకు దీర్ఘకాలిక డిమాండ్ ఉండే అవకాశం ఉందని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా సిమెంట్ పరిశ్రమ పురోగతి అద్భుతంగా ఉందన్నారు. సిమెంట్ కంపెనీల లాభాలు కూడా ఏటేటా భారీగా పెరుగుతున్నాయన్నారు.
సిమెంట్‌కు భారీ డిమాండ్
దేశంలో రానున్న రోజుల్లో సిమెంట్ ఉత్పత్తికి దేశీయంగా భారీగా డిమాండ్ పెరుగుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2021లో ప్రారంభించిన గతిశకి ్త-నేషనల్ మాస్టర్ ప్లాన్ పథకం ద్వారా పెద్ద ఎత్తున రహదారి వ్యవస్థ బలోపేతం కోసం పనులు చేపడతామన్నారు. దీంతోపాటు మౌలిక వసతుల కల్పన, పేదల పక్కా గృహాల నిర్మాణంపై కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిర్మాణ పనుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో సిమెంటుకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఇస్రా (ఐసిఆర్ఎ) క్రిసిఎల్ సిమెంట్ మ్యాన్యూఫాక్చర్స్ అసోషియేషన్ లాంటి సంస్ధలు అంచనా వేస్తున్నాయన్నారు.
ప్రపంచంలోనే రెండవ స్థానంలో భారత్
సిమెంట్ ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలోనే భారతదేశంలో రెండో స్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మరిన్ని సిమెంట్ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రానున్న పదేళ్లలో అరబ్ దేశాలతోపాటు ఆఫ్రికా దేశాలకు సిమెంట్ ఎగుమతి చేసే ప్రధాన ఎగుమతిదారుగా నిలిచేందుకు వీలుందన్నారు. ఈ విషయంలో కేంద్రం దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలని సూచించారు.
రానున్న పదేళ్లలో ఇతర దేశాలకు ఎగుమతి
రానున్న పదేళ్లలో అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకు సిమెంట్ ఎగుమతి చేసే ప్రధాన ఎగుమతిదారుగా నిలిచేందుకు వీలుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలని సూచించారు. ఇన్ని సానుకూలాంశాలున్నా కేంద్ర ప్రభుత్వం సిసిఐ యూనిట్ తిరిగి తెరిచేందుకు నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిలాబాద్‌లోని సీసీఐ తిరిగి తెరవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు చేయూతగా నిలుస్తుందన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తిరిగి తెరుస్తామంటే నూతన పరిశ్రమలకు ఇచ్చే మాదిరే అన్ని ప్రొత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. సిసిఐ కంపెనీ పునః ప్రారంభానికి తన వంతు ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తుందన్నారు. గతంలో పలుసార్లు ఈ విషయంలో కేంద్రాన్ని కోరామని, కేంద్ర మంత్రులు అనంత్ గీతే, మహేంద్రనాథ్ పాండేలకు తమ ప్రభుత్వం తరఫున విజ్తప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.
కేంద్రం తీరు వల్ల…రాష్ట్రానికి తీరని నష్టం
కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో పలుమార్లు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినా సిసిఐ యూనిట్‌ను పున:ప్రారంభించకపోవడమంటే రాష్ట్ర యువతకు, ముఖ్యంగా ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్‌ను తిరిగి తెరుస్తుందన్న ఆశాభావాన్ని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు.