Monday, November 18, 2024

కశ్మీర్‌పై ‘కనువిప్పు’!

- Advertisement -
- Advertisement -

Restoration of democracy in Kashmir

 

జమ్మూ కశ్మీర్‌ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని కూడా పూర్తిగా మార్చివేయాలని దాదాపు రెండేళ్ల క్రితం మోడీ అమిత్ షాలు ప్రయోగించిన వ్యూహం బెడిసికొట్టిందని స్పష్టపడుతున్నది. కశ్మీర్ ప్రధాన రాజకీయ పక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలు సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు గురువారం నాడు ప్రధాని పిలుపుపై ఆయనను కలుసుకోడం అనేక విధాలుగా ఒక విశిష్ట పరిణామం. దేశ సరిహద్దుల్లోని అతి సున్నితమైన రాష్ట్రంలో కేవలం అపరిమితమైన అధికారం అండతో దురుసుగా జోక్యం చేసుకోడం వల్ల ఆశించిన లక్షం నెరవేరకపోగా అంతర్జాతీయ సమాజం దృష్టిలో పలచబడిపోతున్నామనే వాస్తవిక అవగాహన కేంద్ర పాలకుల్లో ఇప్పటికైనా కలిగినందుకు సంతోషించాలి.

కేంద్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన ఢిల్లీతో గల దూరాన్ని, హృదయాల మధ్య ఏర్పడిన అంతరాన్ని కూడా తగ్గించాలని ప్రధాని మోడీ ఈ భేటీనుద్దేశించి అనడం గమనించవలసిన అంశం. కశ్మీర్‌లో తాము ఇంత వరకు తీసుకున్న నిర్బంధ చర్యలు అక్కడి ప్రజలను తమకు చేరువ చేయలేకపోగా మరింత దూరం చేశాయనే అభిప్రాయం ఇందులో ధ్వనిస్తున్నది. స్థానిక రాజకీయ పక్షాలతో కలిసి అక్కడ పూర్వ స్థితిని పునరుద్ధరించాలనే మంచి ఆలోచన కేంద్రంలో కలిగిందనడానికి ఇది నిదర్శనం. కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి కల్పిస్తామని గత కొంత కాలంగా కేంద్ర పెద్దలు చెపుతూనే ఉన్నారు. దానిని ప్రధాని ఈ భేటీలో స్వయంగా ప్రకటించడం సంతోషదాయకం. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరిపించి అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యా న్ని పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ముందుగా నియోజక వర్గాల పునర్విభజనను వీలైనంత తొందరగా జరిపించదలచామని చెప్పి అందుకు సహకరించాలని కశ్మీర్ నాయకులను ప్రధాని కోరినట్టు వార్తలు చెబుతున్నాయి.

2019 ఆగస్టులో తీసుకున్న కఠిన వైఖరికి ఇప్పటి కేంద్ర పాలకుల తీరుకు ఎంత వైరుధ్యమున్నదో దీనితో అర్థమవుతున్నది. అయితే జమ్మూ కశ్మీర్ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ అంశం ఈ సమావేశంలో కొట్టవచ్చినట్టు ముందుకు రాలేదు. కశ్మీర్ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ అది కోర్టులో ఉన్నందున దాని గురించి ఇప్పుడు పట్టుపట్టనవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కుల పునరుద్ధరణ విషయం పక్కన పెట్టడం వల్ల యథాపూర్వ స్థితి పూర్తిగా ఏర్పడే అవకాశం బహు తక్కువ. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణను నేరుగా డిమాండ్ చేయలేదు. కాని కశ్మీర్ ప్రజల స్థానికతను, అక్కడి ఉద్యోగాలపై వారి హక్కును కాపాడాలని కోరినట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఈ అంశం వివాదాస్పదంగా కొనసాగే అవకాశమున్నది. నియోజక వర్గాల పునర్విభజన ఘట్టంలోనూ కేంద్రానికి, స్థానిక నాయకులకు విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.

జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తాము నిలబెట్టే కొత్త నాయకత్వానికి ప్రజల్లో ప్రాధాన్యత పెరిగేలా చూసేందుకు కేంద్రం గట్టి ప్రయత్నమే చేసింది. అది బొత్తిగా ఫలించలేదని అక్కడ జరిగిన డిడిసిల ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. డిడిసిలను కేంద్రమే స్వయంగా ఏర్పాటు చేసి వాటికి ఎన్నికలు జరిపించింది. ఈ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో పోటీ చేసిన వారు చెప్పుకోదగినంతగా నెగ్గలేదు. అక్కడి ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులే మెజారిటీ సాధించారు. ఇలా తాము కశ్మీర్‌లో తీసుకున్న తీవ్రమైన నిర్ణయాలు ఆ ప్రజలను తమకు దూరం చేశాయనే అవగాహన కేంద్ర పాలకుల్లో కలిగి ఉండాలి. అదే సందర్భంలో అమెరికా నుంచి పెరిగిన ఒత్తిడి కూడా ఇందుకు దారి తీసిందని భావించాలి. కశ్మీర్‌లో మామూలు స్థితిని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని భారత్‌ను కోరినట్టు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డీన్ థామ్సన్ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)కు ఈ నెలలోనే తెలియజేసినట్టు సమాచారం.

అలాగే పాకిస్థాన్‌తో తెర వెనుక సంబంధాలు నెలకొల్పుకొని అధీనరేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించి, అటు నుంచి చొరబాట్లను కూడా బాగా తగ్గించుకోగలిగిన క్రమాన్ని కొనసాగించాలంటే కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని కేంద్ర పాలకులు భావించినట్టు తెలుస్తున్నది. గత దాదాపు రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో తీసుకున్న నిర్బంధ చర్యలు సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ వినియోగంపై విధించిన ఆంక్షలు అంతర్జాతీయ సమాజ దృష్టిలో తమ స్థాయిని బాగా తగ్గించి వేశాయనే దృష్టి ఈ కొత్త అడుగులకు దోహ దం చేసి ఉండవచ్చు. ఇక ముందు జరిగే పరిణామాల్లో కేంద్రం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందనే దానిపై జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడడం ఆధారపడి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News