సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లించనున్నారు. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుజాము నుంచి దారి మళ్లింపు సహా పలు ఆంక్షలు ఉంటాయని, జాతర కారణంగా వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు.
కోదాడ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద నేషనల్ హైవే 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేటకు వచ్చే బస్సులు, ప్రజా రవాణా వాహనాలు ఎస్సారెస్పీ కెనాల్ మీదుగా బీబీగూడెం నుంచి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్లే వాహనాలను కుడకుడ, ఐలాపురం, ఖమ్మం జాతీయ రహదారిపై నుంచి రాఘవాపురం స్టేజీ, నామవరం మీదుగా గుంజలూరు స్టేజీ వరకు మొత్తంగా మళ్లించి కోదాడ వైపు పంపనున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు : సూర్యాపేట మీదుగా వచ్చే భక్తుల కోసం హెచ్‌పీ పెట్రోల్ బంకు నుంచి రాంకోటితండాకు వెళ్లే మార్గంలో వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. గరిడేపల్లి, పెన్‌పహాడ్ వైపు నుంచి వచ్చే వాహనాలను పాత కలెక్టర్ ఆఫీస్ వెనుక ఏర్పాటు చేసిన స్థలంలో నిలపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోదాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఖాసీంపేట గ్రామం మార్గంలో ఉంచాల్సి ఉంటుంది. మోతె, చివ్వెంల మీదుగా జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను చివ్వెంల మీదుగా మళ్లించి మున్యానాయక్‌తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వివరించారు.