బహిరంగ సభల్లో వెయ్యిమందికి ఈసీ ఓకే
అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పార్టీలు లేదా అభ్యర్థుల రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్‌లపై ఎన్నికల సంఘం మరోసారి ఫిబ్రవరి 11 వరకు నిషేధం పొడిగించింది. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడిలో భాగంగా జనవరి 8 న విధించిన పలు ఆంక్షలకు మరికొన్ని సడలింపులు ఇచ్చింది. అధికారుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లో బహిరంగ సభలకు గతంలో 500 మందికి మాత్రమే అనుమతించిన ఈసీ, ఈసారి ఆ సంఖ్యను 1000 కి పెంచింది. అలాగే ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకు బృందంగా వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఇండోర్‌ల్లో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి మించరాదని పరిమితి విధించిన ఈసీ, ఈసారి ఆ సంఖ్యను 500 వరకు పెంచింది. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు , ఐదు రాష్ట్రాల సీఎస్‌లు, ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలను కూలంకుషంగా చర్చించడంతోపాటు వారి అభిప్రాయాలను సేకరించారు. అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాజా ఆదేశాలు జారీ చేశారు.