Wednesday, January 22, 2025

భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!

- Advertisement -
- Advertisement -

చెప్పేది మంచి అయినప్పుడు ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు. సెల్ ఫోన్ విచ్చలవిడి వాడకం మొదలైన దగ్గర నుండి సంభాషణల విలువ అథఃపాతాళానికి దిగజారి, ఉన్నావా? తిన్నావా? పడుకున్నావా? లాంటి తేలిక పదాలు, బూతు కవరింగుల డబుల్ మీనింగ్‌ల దాకా విలువ లేని మాటలే వినసొంపవు తున్నాయి. ‘వ్యథా లాపన- వృథా కాలయాపన’ జరుగుతోంది. వ్యక్తిగత విషయాలు వదిలేస్తే, సామాజిక, రాజకీయ విషయాలకు సంబంధించిన వితండవాదన, విపరీత ధోరణి, విశృంఖల సంభాషణలు, వినలేని, రాయలేని మాటలతో కొత్తపుంతలు తొక్కుతూ జర్నలిజం పేరుతో ఫుల్ మాస్కులు తొడుక్కున్న అనేక చిన్నచితకా యూ ట్యూబ్ ఛానల్స్, మిగతా సోషల్ మీడియా వేదికలు, వారు చెప్పిందే వార్త అన్నట్టు,

వారి వ్యక్తిగత అభిప్రాయాలను వినాల్సిందే అన్నట్లుగా ప్రజలకు విషయంలో విషాన్ని కలిపి బుర్రలోకి ఎక్కిస్తున్నారు. కొన్ని నేషనల్, లోకల్ న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్ కూడా ఏదో ఒక రాజకీయ నీడలో అక్షరాలకు హంగులద్దుతూ ఆ రంగులు ప్రజలకు పులిమే ప్రయత్నం చేస్తున్నాయి. యూ ట్యూబులో ఛానల్ ఓపన్ చేయగలిగే జడ పదార్ధం కూడా జర్నలిజం ఆకారమై, విశృంఖలతకు ప్రాకారమవుతోంది. పుంఖానుపుంఖాలుగా, ఆరోగ్యం, వైరాగ్యం, భక్తి, ముక్తి, విరక్తి, విముక్తి, రాజకీయం, అరాచకీయం ఏదైనా వారి సొంత అభిప్రాయాల కలబోతను మనకు సూక్తి ముక్తావళిగా వినిపిస్తున్నాయి. ఇక నిషేధించబడ్డ శృంగారాలు, శ్రుతి మించడాలు కూడా ప్రసారాలకు కొత్తదారులు వెతుక్కుంటూ కోరుకున్న వాళ్ళకు కనువిందు చేస్తూనే ఉన్నాయి.

‘అంతా నా యిష్టం’ అనుకుంటున్న కొన్ని మీడియా వేదికల్లో కనీసం మన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేయడానికి కూడా రాజకీయ పార్టీల పర్మీషనో, సోషల్ మీడియా పర్మీషనో తీసుకోవాలనే విషయం అవగాహన లేని అమాయకురాలు గీతాంజలి అనే అమ్మాయి ఇటీవల ప్రభుత్వం నుండి పొందిన లబ్ధిని సంతోషంగా మైకు ముందు వెలిబుచ్చిన కారణమే నేరమై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తుల ట్రోలింగ్‌లకు తీవ్ర మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించి, వారి కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. భరించలేని వికృత ట్రోలింగ్ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల నిపుణులతో సంప్రదింపుల తర్వాత 2000 నాటి చట్టప్రకారం అశ్లీల వెబ్‌సైట్లను, ఒటిటి ప్లాట్‌ఫాంలను కొన్నింటిని తొలగించే చర్య తీసుకుంది.

అధునాతన నాగరికతను ఉదాత్తంగా వంటబట్టించుకున్న వారు కొందరు దీన్ని వ్యతిరేకించినా చర్యలు మంచికోసం చేసినవిగా గుర్తించాలి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో వ్యాపార, ఉద్యోగరంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధితో జీవితాలను మార్చుకుని కీర్తిగడించినవారెందరో ఉన్నారు. కానీ భావ ప్రకటనా స్వేచ్చ ముసుగులో వ్యక్తిగత హననం, అవాస్తావాల ప్రచారాలకు ఈ వేదికలను ఉపయోగించే వారిపై నియంత్రణకు కఠినమైన చట్టాలు లేకపోవడం దురదృష్టం. ప్రభుత్వాల మీద బురదజల్లే వ్యక్తులు, ఛానళ్ళు మాత్రం కేసులపాలవుతున్నారు. వ్యవస్థీకృతంగా జరిగే నేరాలపైన చర్యలు అంత వేగవంతంగా లేకపోవడంవల్ల అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలపై మహిళలే అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఈ సమాజంలోని భ్రష్టుత్వాన్ని బహిరంగపరుస్తోంది. పార్టీల పట్ల, లేదా ప్రభుత్వాల పట్ల, నాయకులపట్ల లేక ఈ సమాజం పట్ల ఏ మనిషికైనా ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని సున్నితంగా భావ వ్యక్తీకరణ చేయడంలో తప్పులేదు కానీ తమకు భజన చేయనివారందరినీ బలితీసుకుంటామంటే మాత్రం అది ఆమోదించవలసిన విషయం కాదు. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికత సరైన రీతిలో ఉపయోగించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత-.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News