సెప్టెంబర్‌లో 5.02 శాతం నమోదు
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్ల సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో 5.02 శాతంతో సూచీ మూడు నెలల కనిష్టానికి తగ్గింది. అంటే ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.81 శాతం తగ్గింది. ఆగస్టులో ఇది 6.83 శాతంగా ఉంది. ఇక జూలైలో ఇది 7.44 శాతంగా ఉంది. కూరగాయల ధరలు తగ్గడం వల్ల సెప్టెంబర్‌లో పట్టణ ద్రవ్యోల్బణం రేటు 4.65 శాతానికి తగ్గింది.
ఆగస్టులో ఇది 6.59 శాతంగా ఉంది. గ్రామీణ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.02 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో ఇది 5.33 శాతానికి తగ్గింది. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత ద్రవ్యోల్బణం అంచనాలను ప్రకటించారు. 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతం ఉంటుందని పేర్కొన్నారు.
గత సమావేశంలో 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెంచారు. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తికి సంబంధించినది, ఉదాహరణకు ద్రవ్యోల్బణం రేటు 6 శాతం అయితే, సంపాదించిన రూ. 100 విలువ కేవలం రూ.94 మాత్రమే ఉంటుంది. అందువల్ల ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. లేదంటే వ్యక్తుల డబ్బు విలువ తగ్గిపోతుంది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పెంచింది. ఆర్‌బిఐ గత ఏప్రిల్, జూన్, జూలై నెలల్లో రెపో రేటును పెంచలేదు. అంతకుముందు ఆర్‌బిఐ రెపో రేటును వరుసగా 6 సార్లు పెంచింది.