మృతుల కుటుంబానికి రూ. 45లక్షలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లఖీంపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకి చెందిన స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ సహా మూడు ఎస్‌యూవిల కాన్వాయ్ ఆదివారం కన్నూమిన్నూ కానక నిరసన తెలుపుతున్న రైతుల మీదకు దూసుకుపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు. వారిలో నలుగురు రైతులు కూడా ఉన్నారు.
లఖీంపూర్ ఖేరిలో చనిపోయిన నలుగురు రైతు కుటుంబసభ్యులకు రూ. 45 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గాయపడ్డ రైతులకు రూ. 10 లక్షలు ఇవ్వనున్నారు. ఈ దుర్ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించనున్నామని శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఆ నలుగురు రైతుల భౌతిక కాయాల పోస్ట్‌మార్టం సోమవారం జరిపినట్లు ఖేరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శైలేంద్ర భట్నాగర్ తెలిపారు. కాగా మరి నాలుగు భౌతిక కాయాలను అటాప్సీకి పంపినట్టు కూడా ఆయన తెలిపారు.
అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌పై తికోనియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. అదే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై సుమీత్ జైస్వాల్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయింది. ఇదిలా ఉండగా బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, బిఎస్‌పికి చెందిన ఎస్ సి మిశ్రా, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్‌ను ఘటనాస్థలికి వెళ్లకుండా పోలీసులు ఆపేశారు.
- Advertisement -