ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండి శ్రీధర్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా శాసనసభ్యుల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సుపెంపుపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నది. కాగా రామగుండం నియోజక వర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు, మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యుడు దివాకర్ రావు, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్ నగర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లోని పలు ప్రజా సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తెచ్చారు. సింగరేణి పరిధిలో బాధితులకు ఇండ్ల స్థలాలను సింగరేణి సంస్థ కేటాయించి కలెక్టర్లకు అప్పగించిందని వాటిని సత్వరమే పంపిణీ చేయాలని ఎంఎల్‌ఎలు
చేసిన అభ్యర్థనకు సిఎం కెసిఆర్ తక్షణమే స్పందించారు. దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చే అంశాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
రాష్ట్రపతి ఆమోదించిన జిల్లాల వారిగానే డిఎంఎఫ్‌టి నిధులు
సింగరేణి ఒపెన్‌కాస్ట్ ప్రాంతంలో బొగ్గు తవ్వకం, రవాణాద్వారా పొల్యూషన్, రోడ్లు పాడవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈనేపథ్యంలో సింగరేణి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటు చేసిన ‘డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్” (డిఎంఎఫ్‌టి) నిధులను ఇక నుంచి ఉమ్మడి జిల్లాకు కాకుండా ఇటీవల రాష్ట్రపతి ఆమోదించిన జిల్లాల వారిగానే కేటాయించబడుతాయని సిఎం తెలిపారు. రాష్ట్రంలో లో జిల్లాలు అంటే నోటిఫై చేసిన 33 జిల్లాలుగానే భావించాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఆయా జిల్లాల పరిథిలోని నియోజకవర్గాలకే డిఎంఎఫ్‌టి నిధులు కేటాయిస్తామని సిఎం అన్నారు.
కొత్త ఇళ్ల నిర్మాణంపై చర్చించి నిర్ణయం తీసుకుంటా
దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి సంస్థ అగ్రగామిగా దూసుకుపోతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా సింగరేణి కార్మికులు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ రాకముందు రూ. 12,000 కోట్లుగా ఉన్న సింగరేణి ఆదాయం ప్రస్తుతం రూ. 27,000 కోట్లకు చేరుకోనున్నదన్నారు. కాగా సొంత జాగలున్న పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం నగదు రూపంలో సాయం చేయాలని, గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ , ఎన్టీఆర్ ఇండ్లు శిధిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు చేసిన అభ్యర్థనకు సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అర్హులైన వారికి దళిత బందు అందాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుచబోతున్న దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు చేరే విధంగా కృషి చేయాలని కోల్ బెల్ట్ శాసనసభ్యులకు సిఎం కెసిఆర్ సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయని తెలిపారు. వారికి దళిత బంధు పథకం ప్రాధాన్యతను తద్వారా దళితుల జీవితాల్లో పథకం ద్వారా జరగబోయే గుణాత్మక మార్పుల గురించి సిఎం కెసిఆర్ వివరించారు.