న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికలను, కీలకమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. 25వ సిఇసిగా సుమారు మూడు సంవత్సరాలు సాగిన రాజీవ్ కుమార్ హయాం ఎక్కువ ఎన్నికల విజయాలను నమోదు చేసింది. అయితే, ఆయన పక్షపాతంతో వ్యవహరించారని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేశాయి. ఎన్నికల కమిషనర్‌గా 2020 సెప్టెంబర్ 1న ఇసిలో చేరిన రాజీవ్ కుమార్ 2022 మే 15న 25వ సిఇసిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండు హోదాల్లో దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు ఇసిలో సేవలు అందించారు.
ఇసిగా తన హయాంలో ఆయన వ్యవస్థాత్మక, సాంకేతిక, సామర్థం అభివృద్ధి, కమ్యూనికేషన్. అంతర్జాతీయ సహకారం, పరిపాలన యంత్రాంగం వంటి వివిధ అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చారు. రాజీవ్ కుమార్ 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు, 2022లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించడం ద్వారా ఒక ‘సంపూర్ణ ఎన్నికల వలయాన్ని’ పూర్తి చేశారు. అయితే, ఇవిఎంల సామర్థం వోటర్ల డేటా తారుమారు, అధికార బిజెపి పట్ల ‘ఔదాశీన్యం’ ప్రదర్శించడం సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తల నుంచి ఆయన తరచు విమర్శలు ఎదుర్కొన్నారు. కమిషన్ ఆరోపణలకు లిఖితపూర్వకంగా స్పందించి, తిరస్కరించగా, రాజీవ్ కుమార్ తనను, ఇసిని సమర్థించుకోవడానికి తరచు కవితలను ఎంచుకున్నారు.
‘రిటైర్‌మెంట్ అనంతరం పదవి చేపట్టడానికి అధికార బిజెపి పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని’ విమర్శలు వచ్చినప్పుడు రాజీవ్ కుమార్ తాను పదవీ విరమణ చేసిన తరువాత ‘ఆత్మావలోకనానికి ఆరు నెలల పాటు ‘హిమాలయాలకు’ వెళతానని ప్రకటించారు. మంగళవారం పదవిలో తన చివరి రోజు రాజీవ్ కుమార్ ‘పిటిఐ వీడియోస్’తో మాట్లాడుతూ, తాను అత్యంత సమర్థుల చేతుల్లో ఇసిని వదులుతున్నానని, భారతీయ వోటర్లు తమ శక్తి మేర కమిషన్‌కు అండగా నిలుస్తారని చెప్పారు. రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేశ్ కుమార్ సిఇసిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటించిన విషయం విదితమే. 1984 బ్యాచ్ బీహార్/ ఝార్ఖండ్ కేడర్ ఐఎఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైరయ్యారు.