మన తెలంగాణ/ హైదరాబాద్: జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 40 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా గత నెల 30న పదవి విరమణ పొందారు. ఇందులో 10 మంది టెక్నికల్ గ్రేడ్ -2 గా, 17 మంది ఎస్పీఈ లుగా, మరో 13 మంది జీపీఈలుగా పనిచేశారు. వీరందరిని ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవి విరమణ ద్వారా లభించే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు.
పదవీ విరమణ అయిన మరుసటి రోజే ప్రయోజనాలు వచ్చేలా…
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తరువాత నుంచి పదవి విరమణ పొందిన వారికి రిటైర్‌మెంట్ అనంతరం వచ్చే బెనిఫిట్లు అందేలా చూడాలనే ఉద్యోగుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకున్నారు. జలమండలిలో పదవి విరమణ పొందే నాటికి వాటికి సంబంధించిన అన్నింటిని సిద్ధం చేసి విరమణ చేసిన మరుసటి రోజే అన్ని ప్రయోజనాలను అందిస్తున్నారు. 40 మంది పదవి విరమణ చేసిన సందర్భంగా వారందరికీ ఇచ్చిన చెక్కుల విలువ దాదాపు రూ.14 కోట్లు. అంటే ఒక్కక్కరికి సగటున రూ.20 లక్షల చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, పీ అండ్ ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం సరస్వతి, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్తర్, జనరల్ సెక్రటరీ జయరాజ్ లతో పాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.