ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “అశ్వత్ మారిముత్తు అద్భుతమైన దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది”అని అన్నారు.
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ “ఓ మామూలు అబ్బాయి.. జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా డ్రాగన్ చిత్రం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే ప్రతీ ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ “ఈ సినిమాలో హీరో ప్రదీప్, హీరోయిన్లు కయాదు, అనుపమ అద్భుతంగా నటించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. మంచి చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవి శంకర్, ఎస్.కె.ఎన్, కయాదు లోహార్, అర్చనా కల్పాతి తదితరులు పాల్గొన్నారు.