Thursday, January 23, 2025

నీట్ మార్కుల పునర్ మూల్యాంకనం

- Advertisement -
- Advertisement -

టాప్ ర్యాంకులు కోల్పోనున్న ఆరుగురు అభ్యర్థులు

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(నీట్) యుజి వైద్య ప్రవేశ పరీక్షలో అక్రమాలు, మార్కుల హెచ్చింపు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) అభ్యర్థుల మార్కులను పునర్ మూల్యాంకనం చేపట్టినట్లు వర్గాలు తెలిపాయి. పరీక్ష జరిగిన రోజున నష్టపోయిన సమయాన్ని దృష్టిలో ఉచంపకుని ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్‌టిఎ తొలగించడంతో టాప్ స్కోరు చేసిన 67 మంది అభ్యర్థులలో ఆరుగురు టాప్ ర్యాంకును కోల్పోనున్నట్లు వారు చెప్పారు. ఒక సూత్రాన్ని ఆధారం చేసుకుని వర్తింపచేసిన ఈ గ్రేస్ మార్కులను రద్దు చేయడం వల్ల హర్యానాలోని ఝాజర్‌లోని ఒక పరీక్షా కేంద్రానికి చెందిన అభ్యర్థులు 60-70 పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని వారు తెలిపారు.

జులై 8న సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోనున్నది. 1563 మంది అభ్యర్థులకు కల్పించిన గ్రేస్ మార్కులను రద్దు చేసినట్లు ఎన్‌టిఎ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియచేసింది. ఈ అభ్యర్థులకు జూన్ 23న మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని ఎన్‌టిఎ కల్పించింది. నీట్ యుజి పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఎన్‌టిఎ తీవ్ర విమర్శల పాలైంది. ఆరు సెంటర్లలో పొరపాటున వేరే ప్రశ్నాపత్రాన్ని పంపిణీ చేయడం వల్ల పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులకు నష్టపరిహారంగా గ్రేస్ మార్కులను ఎన్‌టిఎ జోడించింది. కాగా అ పరీక్షా కేంద్రాలపై ఎన్‌టిఎ చర్యలు చేపట్టింది. కాగా..కొన్ని ఇతర సెంటర్లలో పేపర్ లీక్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సెంటర్లలో చాలామంది అభ్యర్థులకు 500 కన్నా తక్కువ మార్కులు లభించాయని ఎన్‌టిఎ తెలిపింది. బీహార్‌లోని కొన్ని సెంటర్లతోపాటు గుజరాత్‌లోని గోద్రాలోని సెంటర్లలో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రాగా దీని వల్ల విద్యార్థులెవరూ ప్రయోజనం పొందలేదని, వారెవరికీ 500కి మించి మార్కులు రాలేదని ఎన్‌టిఎ వాదిస్తోంది.

ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందాలంటే 650 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావలసి ఉంటుంది. టాప్ కాలేజీలలో సీటు సంపాదించాలంటే 690కి మించి మార్కులు రావలసి ఉంటుంది. ఇదిలా ఉండగా నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపదల చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం మరోసారి తోసిపుచ్చింది. జులై 6వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అంతేగాక నీట్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే విద్యార్థులు, విద్యావేత్తలు దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్రం, ఎన్‌టిఎకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. గతవారం పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నీట్ నిర్వహణలో 0.001 శాతం నిర్లక్షం కనబరిచినా ఉపేక్షించేది లేదని మంగళవారం సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్‌టిఎ కఠిన వైఖరిని ప్రదర్శించాలని, పరీక్షలో జరిగిన పొరపాట్లకు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News