Sunday, November 17, 2024

రేవణ్ణకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

కిడ్నాప్ కేసులో జెడిఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రేవణ్ణ కుమారుడు, హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ ఒక మహిళపై లైంగిక దాడి జరిపినట్లు ఆరోపణలు రాగా ఆ మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది. దీంతో రేవణ్ణను పోలీసులు మే 4న అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్‌కు పంపారు. సోమవారం రేవణ్ణ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ షరతులతో కూడిన బెయిల్‌ను రేవణ్ణకు మంజూరు చేశారు. కాగా..అంతకుముందు రేవణ్ణకు విధించిన మూడు రోజుల జుడిషియల్ కస్టడీ మే 8వ తేదీకి ముగియగా 17వ అదనపు చీఫ్ మెట్రోపలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయనను హాజరుపరచగా ఆయనకు మే 14 వరకు ఏడు రోజులపాటు జుడిషియల్ కస్టడీని పొడిగించారు.

తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి జరిపినట్లు కిడ్నాప్‌నకు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రేవణ్ణపై కేసు నమోదైంది. ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకుండా అడ్డుకునేందుకు ఆ మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో రేవణ్ణ అనుచరుడు సతీష్ బాబన్నను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత హెచ్ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కర్నాటకలో ఏప్రిల్ 26న జరగగా మరుసటి రోజు ఏప్రిల్ 27న దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయనను వెనక్కు తీసుకువచ్చేందుకు కర్నాటక పోలీసులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీచేశారు. జెడిఎస్ సిట్టింగ్ ఎంపి అయిన ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి కూడా పోటీ చేశారు. బిజెపి-జెడిఎస్ కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News