Tuesday, January 21, 2025

రేవంత్‌కు అమరుల పేర్లు పలికే అర్హత లేదు : టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరుల పేర్లను ఉద్యమద్రోహి, తెలంగాణ ద్రోహి అయిన టి పిసిని చీఫ్ రేవంత్ రెడ్డి పలకడం వారిని అవమానించడమే అవుతుందని టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి గురువారం నాడొక ప్రకటనలో విమర్శించారు. అమరులు శ్రీకాంతచారి, యాదిరెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమంలో ముందు కదిలారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండి.. చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేసి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచాడన్నారు.

రెండు కళ్ల సిద్ధాంతమంటూ యువతను రెచ్చ గొట్టిన చంద్రబాబు సంకలో దూరి.. తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలకు కారణమయ్యాడన్నారు. అలాండోడు ఇవాళ వచ్చి తెలంగాణ కోసం తాను ఏదో చేసినట్టుగా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నాడని సతీష్ రెడ్డి విమర్శించారు. వాళ్ల పేర్లు పలికే అర్హత కూడా నీకు లేదని, వాళ్ల కాళ్ల గోటికి కూడా తను సరిపోడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను వెన్నంటి ఉంది కాబట్టే నేడు కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ఎంబిబిఎస్ చదవగలిగిందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లోనే డాక్టర్ గా ఉద్యోగం కూడా చేస్తోందన్నారు.

అమరుల త్యాగాలకు నివాళిగా అత్యద్భుతమైన స్మారకాన్ని నగరం నడిబొడ్డున ప్రభుత్వం నిర్మించుకోగలిగిందని, కానీ ఉద్యమద్రోహివి, ఉద్యమకారులపైకి తుపాకి పట్టుకుని ఉరికినోడివి, పదవుల కోసం పాకులాడి ఉద్యమాన్ని విస్మరించినోడివి.. నీకు ఇవన్నీ ఎలా కనిపిస్తాయని మండిపడ్డారు. తనకు రాష్ట్రం అంటే పట్టింపు లేదని, కేవలం రాజకీయాలు.. తనను తెర వెనక నుంచి నడిపిస్తున్న వారి ఆదేశాలు అమలు చేయడం మాత్రమే తెలుసన్నారు. అందుకే రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి పార్లమెంట్ లో మాట్లాడడం లేదన్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని పట్టించుకోరని, ఆనాడు ఉద్యమాన్ని అడ్డుకుని వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకులైన వారిలో రేవంత్ కూడా ముఖ్యుడని అన్నారు. ఇప్పుడు అదే రీతిలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఎన్నికలు దగ్గరపడున్నవేళ.. ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా తను చేసిన పనులు ఎక్కడ బయటపడతాయోనని.. ఇష్యూను డైవర్ట్ చేయడానికి సర్కారు మీద, సీఎం మీద, మంత్రి కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నాడన్నారు. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రేవంత్ తెలంగాణకు చేసిన ద్రోహం ఎవ్వరూ మరిచిపోరన్నారు. ఇప్పుడు మరోసారి చేయాలనుకుంటున్న ద్రోహాన్ని అడ్డుకుని తీరుతామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News