Wednesday, January 22, 2025

అన్నదమ్ముల అనుబంధం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారపీఠం ఎక్కించే బృహత్తర బాధ్యతను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజాలకు ఎత్తుకున్నారు. అలుపు సొలుపులేకుండా రాష్ట్రమంతా తిరుగుతూ, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆయన  స్వయంగా కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్నారు. కొడంగల్ లో రేవంత్ ప్రధాన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాగా కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం విశేషం. ఈ రెండు నియోజకవర్గాలలోనూ రేవంత్ ప్రచారం అంతంతమాత్రంగానే సాగుతోంది. ఇతర నియోజకవర్గాలలో ప్రచారం సాగిస్తున్న దృష్ట్యా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఆయన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దాంతో రేవంత్ తరఫున ఈ బాధ్యతలను ఆయన సోదరులు తీసుకున్నారు. రేవంత్ రాకపోయినా, ఆ లోటు కనిపించని విధంగా సోదరుడి తరపున వారే జోరుగా ప్రచారం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి, తమ్ముళ్లు జగదీశ్వరరెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రచార బాధ్యతలను పంచుకున్నారు. వీరిలో అన్న తిరుపతిరెడ్డి, చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి కొడంగల్ లోనూ తమ్ముడు కొండల్ రెడ్డి కామారెడ్డిలోనూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే అమెరికానుంచి వచ్చిన ఇంకొక తమ్ముడు జగదీశ్వరరెడ్డి త్వరలో కొండల్ తో కలసి కామారెడ్డిలో ప్రచార బాధ్యతలను పంచుకోబోతున్నారు.

కొడంగల్ లో ఐదు మండలాల్లో రేవంత్ ప్రచారం ముగించారు. తీరికలేని కారణంగా ఆయన మిగిలిన మండలాల్లో ప్రచారం చేపట్టలేకపోతున్నారు. ఆ లోటును తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి భర్తీ చేస్తున్నారు. కొడంగల్ ఇంచార్జిగా ప్రచార బాధ్యతలు చేపట్టిన తిరుపతి రెడ్డి కార్యకర్తలను వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి, తమ్ముడి తరఫున ఓట్లను అర్థిస్తున్నారు. ఇప్పటికే 70-80 శాతం ప్రచారం పూర్తయిందని, మరికొన్ని రోజుల్లో మిగిలిన ఇళ్లను కూడా కవర్ చేస్తామని కృష్ణారెడ్డి చెప్పారు.

తన సోదరుడి తరఫున ప్రజలే స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని, రేవంత్ గెలుపుకోసం స్థానిక నాయకులు బాగా శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. కొడంగల్ లో 2.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తమకు చక్కటి రెస్పాన్స్ వస్తోందనీ, తన సోదరుడు రేవంత్ కు 40 వేలనుంచి 50 వేల మెజారిటీ రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కామారెడ్డిలో తన అన్న తరఫున కొండల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో రెండింటిలో రేవంత్ ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడిన రేవంత్ మరో తమ్ముడు జగదీశ్వరరెడ్డికి రాజకీయాల గురించి అంతగా అవగాహన లేదు. తన సోదరుడికి సాయం చేద్దామని వచ్చాననీ, వీలైనంతగా రేవంత్  తరఫున ప్రచారం చేస్తాననీ ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News