రేవంత్ రెడ్డికు చేతనైతే కృష్ణ నీటి విషయంలో
చంద్రబాబుపై యుద్ధం ప్రకటించాలి
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్దాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక సంబంధాలను నిర్వహించామని, కానీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున సూట్ కేసులు మోయలేదు.. ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదు…రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నా, ఇదేందని తాము ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి, తమ మీద రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు.
సిఎంకు చాతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బిజెపితో పగలు కుస్తీ రాత్రి దోస్తీ అని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బిసి ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన బిఆర్‌ఎస్ ఎందుకు నాయకులను ఆపారు…బిజెపికి ఎందుకు స్వాగతం పలికారు…? అని ప్రశ్నించారు.ఇప్పటివరకు ప్రమాదంపై బిజెపి పల్లెత్తు మాట మాట్లాడలేదని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి ప్రమాదంపై ఎన్‌డిఎస్‌ఎ స్పందించదు, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐ, ఈడి, ఐటీ విచారించవు అని అడిగారు. ఒకరు కొట్టినట్టు, మరొకరు ఏడ్చినట్టు చేసే డ్రామాలు బంద్ చేయాలని, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకండి అని పేర్కొన్నారు.
సెంటిమెంట్‌ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. కెసిఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్‌ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు అని, రేవంత్‌కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం..? అని ప్రశ్నించారు. బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అని పేర్కొన్నారు. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్ అని, తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం అని వ్యాఖ్యానించారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఏది పడితే అది అనగల సమర్థులు మీరు..జలయజ్ఞం ధనయజ్ఞమని మాట్లాడింది మీ నోరే కదా అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నత్త నడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తి చేసింది బిఆర్‌ఎస్ అని, ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్పే సత్యం అని తెలిపారు. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బిఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు.
జలయజ్ఞం గురించి మాట్లాడిన మాటలు మర్చిపోయావా..?
ప్రాజెక్టుల పేరిట డబ్బులు దండుకోవడానికి ఈపీసీ విధానం తెచ్చి ఇష్టమున్నట్టు దోచుకుంది కాంగ్రెస్ నాయకులు అని, ఆనాడు తెలుగుదేశం నాయకుడిగా జలయజ్ఞం అవినీతి భాగోతాల గురించి మాట్లాడిన మాటలు మర్చిపోయావా..? అంటూ హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 3.07లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.42లక్షల ఎకరాలు, బీమా కింద 1.58లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలు, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వ కింద ఉన్న 55వేల ఎకరాలను స్థిరీకరించి, ఆర్డీఎస్‌లో మొత్తం 87,500 ఎకరాలకు సాగు నీరు అందించింది బిఆర్‌ఎస్ కాదా..? అని అడిగారు. జూరాల జలాశయంలో కర్ణాటక ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించి, మొదటిసారిగా జలాశయంలో 9 టీఎంసీల నీటిని నింపి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు.
మిషన్ కాకతీయతో భాగంగా మహబూబ్ నగర్‌లో 1544 చెరువులు, నాగర్ కర్నూల్‌లో 2024, నారాయణ్ పేటలో 950, గద్వాల్‌లో 563, వనపర్తిలో 1329 మొత్తం 6410 చెరువుల కింద 3లక్షల 22వేలు 579 ఎకరాలు స్థిరీకరించామని, 66 చెక్ డ్యాంలు, ఐడీసీ లిఫ్ట్‌ల కింద మరో 24వేల ఎకరాలు స్థిరీకరించామని చెప్పారు. పదేండ్ల కాలంలో ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి, పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చామని అన్నారు. ఈ చరిత్ర మీరు చెప్పక పోయినా, పదేండ్లు పచ్చగా పంటలు పండించుకున్న రైతులను అడిగితే చెబుతారని పేర్కొన్నారు.
కృష్ణా బేసిన్‌లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదంటే ఆ పాపం కాంగ్రెస్‌దే అని, ఎత్తి పోతల పథకాల్లో ఎక్కడా ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా మీరు ప్రతిపాదించలేదని, కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కనీసం 20 టీఎంసీల నిల్వ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కానీ, బిఆర్‌ఎస్ ఒక్క పాలమూరులోనే 67 టీఎంసీల నిల్వ కెపాసిటీని అందుబాటులోకి తెచ్చిందని, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం ఇలా మొత్తం వంద పైగా టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని తాము కదా ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా..? అని ప్రశ్నించారు.