మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్‌ప్రభుత్వం అభయం ఇచ్చింది. ప్రతిఏటా ఆటోడ్రైర్లకు రూ.12వేలు ఆర్ధిక సహాయం అందించనున్నట్టు రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మాన కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. తద్వరా మహిళలకు రూ.13,600కోట్లు ప్రజాధనం అందజేసినట్టవుతుందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు అనుకూలమా లేక వ్యతిరేకమా? తెలపాలని డిమాండ్ చేశారు.
ఆటోడ్రైవర్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రగతిని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఐటి పరిశ్రమ రంగాన్ని పది రెట్లు పెంచుతామన్నారు. ఎంఎస్‌ఎంఇపై త్వరలోనే పాలసీని తీసుకురానున్నామని వెల్లడించారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా రాష్ట్ర ప్రగతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్ చూశాక ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఉండదని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.