హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. రాష్ట్రంలో ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ యాత్రలో భాగంగా ఈ పాదయాత్ర ఉండబోతోంది. ఆదివారం మూడు గంటలపాటు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమవేశం జరిగిన తర్వాత విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. తమ మండలాల్లో, జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్రను చేపట్టాలని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు ఆదేశించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై, తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అభియోగపత్రం విడుదల చేయనున్నట్లు, దానిని ప్రజలకు పంచనున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలు… అంటే ధరణి పోర్టల్, పోడు భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు, రైతుల, యువకుల వ్యథలు వంటివి హైలైట్ చేయనున్నారు. “ ఈ యాత్ర ఇంకా తెలంగాణ అమరవీరులు, విద్య, ఆరోగ్యం, పాలనా సంస్కరణలపై ప్రజలతో చర్చించి వారికి వివరించే ప్రయత్నం జరుగుతుంది, దీనికి తోడు తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే ఏమి చేస్తామనే అజెండా వివరిస్తాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. కమిటీలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులకు చోటు కల్పించడంలేదంటూ బాహాటంగా సీనియర్ నాయకుల వర్గం తిరుగుబాటు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పాదయాత్ర ప్రకటన చేశారు.
భారత రాష్ట్ర సమితి ప్రోద్బలంతోనే సిటీ పోలీస్ కమిషనర్ సివి. ఆనంద్ విధులు నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండానే కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడులు నిర్వహించి కార్యాలయం నుంచి ముఖ్యమైన డేటాను పట్టుకుపోయారని రేవంత్ రెడ్డి ఉదాహరించారు. “పార్టీ అధిష్ఠానం పార్టీలోని అసమ్మతి విషయాన్ని పరిష్కరిస్తుంది. నా లక్ష్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడమే”అని ఆయన పార్టీ నాయకులకు విన్నవించుకున్నారు. అంతేకాక ఆయన పత్రికా రంగం(ఫోర్త్ ఎస్టేట్) రియల్ ఎస్టేట్ మాదిరిగా పనిచేయకూడదని, అది ప్రజల సమస్యలను హైలైట్ చేయాలని మీడియాను కోరారు.