Wednesday, January 22, 2025

కాంగ్రెస్, మజ్లిస్ మధ్య బలపడుతున్న మైత్రీబంధం

- Advertisement -
- Advertisement -

నిన్నటివరకూ ఉప్పు నిప్పూలా ఉన్న కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధం బలపడుతోందా? ఇంగ్లండ్ లో రేవంత్, అక్బరుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసినవారెవరికైనా ఈ అనుమానం రాకమానదు. దావోస్ పర్యటనలోనూ, లండన్ నగరంలో  థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేసే విషయంలోనూ ఇద్దరు నేతలూ కలిసే పాల్గొన్నారు. ఆమాటకొస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మజ్లిస్ పట్ల స్నేహపూర్వకంగానే మెలుగుతూ వస్తోంది.

బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య పదేళ్లుగా స్నేహం కొనసాగుతోంది. మజ్లిస్ మనోభావాలు దెబ్బతింటాయనుకున్న ఏ అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకువెళ్లిన దాఖలాలు గతంలో లేవు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినోత్సవం  జరపనందుకు బీజేపీ ఎంత ఘాటుగా విమర్శించినా, బీఆర్ఎస్ పట్టించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్, బిఆర్ఎస్ ఒకరికొకరు సహకరించుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. మజ్లిస్ అభ్యర్థులపై నామమాత్రపు పోటీకి పరిమితం కావడంద్వారా బిఆరఎస్ తమ స్నేహబంధం ఎంత బలమైనదో చాటుకుంది.

అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మజ్లిస్ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ కు పాతబస్తీ ఆయువుపట్టులాంటిది. తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉండాలన్నా, పాతబస్తీలో అభివృద్ధి పనులు సాగాలన్నా అధికార పార్టీతో వైరం కంటే స్నేహమే మంచిది. పైగా ఎన్నికల ముందు మజ్లిస్ పట్ల రేవంత్ ధోరణి ఎలా ఉన్నా, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆ పార్టీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. దాంతో మజ్లిస్ కూడా కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించింది. మెట్రో రైలుమార్గంలోనూ ముఖ్యమంత్రి రేవంత్.. పాతబస్తీవాసులను దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గాన్ని నిలిపివేసి, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఎల్బీ నగర్, పాతబస్తీ మీదుగా మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది కార్యరూపం దాల్చితే, పాతబస్తీ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నిర్ణయాల ద్వారా తమకు మజ్లిస్ పట్ల శత్రుత్వం ఏమీ లేదని రేవంత్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

ఇక దావోస్ పర్యటనలో రేవంత్ కు అక్బరుద్దీన్ చేదోడువాదోడుగా ఉన్నారు. మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టేందుకు థేమ్స్ నది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు ఇద్దరూ నేతలూ కలసి వెళ్లారు. థేమ్స్ నదిని చూసేందుకు 309 మీటర్ల పొడవున, 72 అంతస్తులతో ఉండే లండన్ షార్డ్ భవనం పైభాగానికి ఇద్దరూ వెళ్లి పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను అక్బరుద్దీన్ విడుదల చేయగా, అది వైరల్ గా మారింది. తెలంగాణా ప్రభుత్వం కూడా రేవంత్, అక్బరుద్దీన్ కలసి లండన్ షార్డ్ పైభాగాన ఉన్న ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. థేమ్స్ నదిని చూసొద్దాం రమ్మంటూ రేవంత్ రెడ్డే అక్బరుద్దీన్ ని ఆహ్వానించినట్లు తెలిసింది.

మజ్లిస్ ను తమవైపు తిప్పుకుని బిఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ టార్గెట్. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మజ్లిస్ తో దోస్తానా అవసరమని భావిస్తోంది. పైగా మజ్లిస్ ను తమవైపు తిప్పుకుంటే, ఆమేరకు బీఆర్ఎస్ ఓట్లకు గండి పడుతుంది. మరోవైపు, అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కు  నాలుగు సీట్లు మాత్రమే అదనంగా గెలిచి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు భవిష్యత్తులో మజ్లిస్ సహకారం అవసరం కావచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కడియం శ్రీహరిలాంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. తాజాగా కేటీఆర్ కూడా ‘ఏడెనిమిది సీట్లు గెలిస్తే హంగ్ వచ్చేది’ అంటూ వ్యాఖ్యానించారు. మజ్లిస్ సీట్లను కూడా దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ ఈ లెక్కలు వేశారన్నది సుస్పష్టం. మజ్లిస్ ను తమవైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ ప్రయత్నాలకు చెక్ పెట్టడం కూడా రేవంత్ ఆలోచనగా కనబడుతోంది. తాజా పరిణామాల దృష్ట్యా లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయో వేచిచూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News