Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి, నేను ఒకే స్కూల్‌లో చదువుకున్నాం

- Advertisement -
- Advertisement -

ఆయన సిఎంగా ఉండాలని కోరుకుంటాను
రేవంత్‌కు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు
రేవంత్ సాబ్ బిఆర్‌ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు 
కానీ సొంత పార్టీ నేతలతో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి
అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి
బిఆర్‌ఎస్ పార్టీది ప్రతిపక్షం కాదని, ఫ్రస్టేషన్ పక్షం అన్నమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, తాను సీనియర్ అయితే, రేవంత్‌రెడ్డి జూనియర్ స్టూడెంట్ అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న కడియం, సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఎటొచ్చి సొంత పార్టీ నేతలతో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకుముందు కడియం శ్రీహరి బడ్జెట్ గురించి మాట్లాడుతూ, గతేడాది ద్రవ్యలోటు రూ.33 వేల కోట్లుగా ఉందని, కానీ ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు భారీగా కనబడుతోందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం పూర్తి చేసిన నియామకాలు తమవిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్ హయాంలో నోటిఫికేషన్ వేసి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కొత్త ప్రభుత్వం చెబుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల తాము నియామక పత్రాలు ఇవ్వలేకపోయామని తెలిపారు. ప్రజల తీర్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గత సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం ఏ మాత్రం బాగోలేదని చెప్పారు.- గత ప్రభుత్వం నాటి నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ కుదించుకున్నామని, కాంగ్రెస్ హామీల అమలుకు రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్ ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. దుబారాపై అధ్యయనం చేసి వాస్తవ బడ్జెట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. దళితబంధు స్థానం అంబేద్కర్ అభయహస్తం పథకం కింద దళితులకు రూ.12 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, కానీ బడ్జెట్ ఆ పథకానికి నిధులు కేటాయించలేదని తెలిపారు. పెరిగిన ఎస్‌సి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే లోపల రిజర్వేషన్ల పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.

నల్గొండ సభలో హోంగార్డు చనిపోతే ఆదుకోలేదు : మంత్రి కోమటిరెడ్డి
కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. నిరుద్యోగులను గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసగించినట్లు తామూ మోసగిస్తామనడం సరికాదని హితవు పలికారు. బిఆర్‌ఎస్ పార్టీది ప్రతిపక్షం కాదని, ఫ్రస్టేషన్ పక్షమని ఎద్దేవా చేశారు. నల్గొండలో బిఆర్‌ఎస్ సభ పెట్టినప్పుడు హోంగార్డు చనిపోతే కెసిఆర్, కెటిఆర్ బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. దళితుడిని సిఎం చేయకపోతే తన తల తీసుకుంటానని కెసిఆర్ అన్నారని, అసలు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత అయితే కెసిఆర్ భరించలేకపోయారని పేర్కొన్నారు. తాము కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యోగాలకు సంబంధించి న్యాయ వివాదాలు పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కొత్తగా టిఎస్‌పిఎస్‌సి కమిషన్‌ను నియమించామని, కమిషన్‌ను ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చామని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సికి ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశామని, ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. పదేళ్లుగా ఉద్యోగాల కోసం యువత ఎదురుచూశారని, యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News