Monday, November 25, 2024

చేవెళ్ల సభలో 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దళితులు, గిరిజనులను ఆదుకోడానికి ఈ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ అభయహస్తం కింద దళిత, గిరిజన కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని, కాంట్రాక్ట్ పనుల్లో కూడా వీరికి రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కెవిఆర్ మైదానంలో కాంగ్రెస్ ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభను శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి చీఫ్ మలికార్జున ఖర్గే హాజరయ్యారు. తొలుత గద్దర్ చిత్రపటానికి ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత, గిరిజన కాంగ్రెస్ నాయకులు ఖర్గేను సన్మానించారు. పలువురు నాయకులు ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.

పదో తరగతి పాసైతే రూ.10 వేలు, పిజి పాసైతే లక్ష
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని తెలిపారు. చేవెళ్ల గడ్డ మీద నుంచి సోనియా గాంధీ సూచన మేరకు దీనిని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకునేందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. పోడు భూములకు పట్టాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దళితులు, గిరిజనులకు 3 కార్పొరేషన్ల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కొత్తగా 5 ఐటిడిఏలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పాసైతే రూ.25వేలు, పిజి పూర్తయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుతో పాటు గ్రాడ్యు యేషన్, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు, తదితర అంశాలను ఈ డిక్లరేషన్‌లో ఆయన పేర్కొన్నారు. అనంతరం చేవెళ్ల వేదికగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News