Monday, December 23, 2024

రైతన్నలు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మల్యాల: తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడంతో, ఇప్పుడిప్పుడే రైతన్నలు ఎదుగుతుండగా ఇది చూసి ఓర్వలేని రేవంత్‌రెడ్డి కారు కూతలు కూస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం మల్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుందన్నారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటూ కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తోందన్నారు. గతంలో రైతులకు విద్యుత్ ఇవ్వకుండా అరిగోస పెట్టారని, కాంగ్రెస్ తీరును రైతన్నలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది హస్తం పార్టీయేనని దుయ్యబట్టారు.

గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి రోజుకు రెండు మూడు గంటలకు మించి ఇవ్వలేదన్నారు. కరెంట్ కోసం ఆనాడు రైతన్నలు సబ్‌స్టేషన్‌ల ఎదుట ఆందోళన చేసి విద్యుత్ అధికారులను గదుల్లో వేసి బంధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో 24 గంటల కరెంట్ ఉండాలి కానీ, రైతన్నకు మాత్రం 24 గంటల కరెంట్ ఉండొద్దా అని ప్రశ్నించారు.

రైతాంగం పట్ల కాంగ్రెస్ వైఖరి ఎంటో స్పష్టం చేయాలని, కాంగ్రెస్ నేతల వైఖరికి నిరసనగా రైతులంతా తీర్మాణాలు చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దంటున్న రేవంత్‌రెడ్డి, రేపటినాడు కాళేశ్వరం నీళ్లు వద్దు… రైతుబంధు కూడా వద్దంటాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి వెంటనే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని, రానున్న ఎన్నికల్లో రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటి రాంమోహన్‌రావు, ఎంపిపి మిట్టపెల్లి విమల, మల్యాల సర్పంచ్ సుదర్శన్, బద్దం తిరుపతి, రాంలింగారెడ్డి, గడ్డం మల్లారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News