హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినా.. కెసిఆర్ లో మార్పు రాలేదని ఆరోపించారు. నిజామాబాద్ లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్లొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బిజెపి, బిఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కెటిఆర్, కెసిఆర్ ను బిజెపి కాపాడుతోందని, బిజెపికి మద్దతివ్వకుంటే అరెస్టు తప్పదని బెదిరించారని చెప్పారు.
అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎందుకు రప్పించట్లేదని అన్నారు. రెడ్ కార్నర్ నోటీసు ఇమ్మంటే కేంద్రం ఎందుకు ఇవ్వట్లేదని, ఈ కార్ రేసింగ్ కేసులో కెటిఆర్ ను ఈడి ఎందుకు అరెస్టు చేయట్లేదని, ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లలో కెసిఆర్ ఎందరో ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, టిడిపి నుంచి తలసాని చేర్చుకుని, కాంగ్రెస్ నుంచి సబితని చేర్చుకుని మంత్రులను చేయలేదానని మండిపడ్డారు. దిల్లీ లో రాష్ర్ట ప్రాజెక్టులను మెట్రో విస్తరణను కేంద్రమంత్రులు అడ్డుకుంటున్నారని వెల్లడించారు. కృష్ణా జలాల్లో మన వాటా పెరగకుండా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులకు కూడా అడ్డుపడుతున్నారని తెలియజేశారు. రుణమాఫీ చేసింది నిజమైతేనే, సన్న వడ్లకు రూ. 500 బోనస్ వస్తేనే కాంగ్రెస్ కు ఓటేయండని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.