హైదరాబాద్: అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని ఆయన పలు పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారన్నారు. ధరణి తెచ్చింది 2020 సంవత్సరంలోనని, రైతుబంధు, రైతుబీమా మొదలు పెట్టింది 2018లోనని అలాంటప్పుడు దీనికి, దానికి ఎలా ముడిపెడతారని ఆయన పేర్కొన్నారు. గతంలో రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.
రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఆధునిక విధానాన్ని తీసుకొచ్చి భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. టైటిల్ గ్యారంటీ ఇచ్చి భూములను కాపాడుకుంటామన్నారు. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిపై 12 వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు సిద్దమా?, అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించాలని, మోడీకి అసదుద్దీన్ ఓవైసీ చోటా భాయ్ అని రేవంత్ వ్యాఖ్యానించారు.