Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో కరెంట్ దుమారం

- Advertisement -
- Advertisement -

ఉచిత విద్యుత్‌పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళన
ఇలాంటి ప్రకటనలు రేవంత్ ఎలా చేస్తారని సీనియర్ల ప్రశ్న
అధిష్టానం దీనిపై చర్యలు
చేపట్టాలని డిమాండ్
రేవంత్ వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్ధిస్తున్న మరోవర్గం

మన తెలంగాణ/హైదరాబాద్: ఉచిత విద్యుత్‌పై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలు పైకి సమర్థిస్తున్నా లోపల పార్టీకి నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు రేవంత్ ఎవరని కొందరు సీనియర్లు ప్రశ్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదనీ, జాతీయ పార్టీ అని, ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే జాతీయ నాయకత్వం తీసుకుంటుందని మరికొందరు స్పష్టం చేశారు.

రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నా లోలోపల మాత్రం దీనిపై చర్చకు తెరదీశారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరిగేలా ఉన్నాయని, అధిష్టానం వద్ద చర్చించాలని విహెచ్ లాంటి నేతలు పేర్కొంటుండగా మరికొందరు నేతలు మాత్రం అది ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని సరిదిద్దే ప్రయత్నం చేశారు. రేవంత్ ఏం మాట్లాడారనే దానిపై ఢిల్లీ అధిష్టానం ఆరా తీసినట్టుగా తెలిసింది.. రేవంత్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్న దానిపై అధిష్టానం చర్చిస్తోంది.
అది ఆయన వ్యక్తిగతం: ఎంపి కోమటిరెడ్డి
ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ మాట్లాడింది తప్పే అని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాకపోతే అది ఆయన వ్యక్తిగతమని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను, రేవంత్ కేవలం కో ఆర్డినేటర్స్ మాత్రమే అని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఏదీ చెబితే అది ఫైనల్ అవుతుందా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
ఉచిత కరెంట్ ఇవ్వవద్దని రేవంత్ చెబితే తప్పే: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన తెలిపారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తనకు తెలియదన్నారు. ఉచిత కరెంట్ ఇవ్వవద్దని రేవంత్ చెబితే తప్పేనన్నారు. దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు.
ఉచిత విద్యుత్‌కు ఒక నేపథ్యం ఉంది:కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు
ఉచిత విద్యుత్‌కు ఒక నేపథ్యం ఉందని, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేయడమే కాకుండా రూ.1250 కోట్ల బకాయిలను రద్దు చేస్తూ రైతులపై పెట్టిన కేసులను ఎత్తేసింద న్నారు. అప్పట్లో తాము తెచ్చిన ఉచిత విద్యుత్‌ను అందరూ తప్పుబట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉచిత విద్యుత్‌పై కట్టుబడి ఉందన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వటమే కాంగ్రెస్ విధానం: మధుయాష్కీ
రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాంగ్రెస్ విధానమని మధుయాష్కీ, ప్రచార కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్‌ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలని, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదు: మల్లు రవి
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్‌లో చెప్పామన్నారు. అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారన్నారు.
ఉమ్మడి ఎపిలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ హయాంలో 12,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను తయారు చేశామని, ఉమ్మడి ఎపిలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పిసిసి ప్రధాన కార్యదర్శి, అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. తానా సభలో ప్రతినిధులు అడిగిన సమాధానాలకు మాత్రమే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారన్నారు.
రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్: పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్, దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని పొన్నం ప్రభాకర్,మాజీ ఎంపి పేర్కొన్నారు. కొందరు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News