Monday, January 13, 2025

ఆల్ ది బెస్ట్ డియర్ సిఎం!

- Advertisement -
- Advertisement -

పడి లేచిన కెరటంలా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తానూ ముఖ్యమంత్రి కాగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొత్త జవసత్వాలను ఇవ్వడమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి అదనపు బలం చేకూర్చాడు రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమతో. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తుచేసుకోవడం సముచితం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నిన్నటికి ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎటువంటి పనులు చేయగలిగింది అన్న చర్చ జరగడం సహజం.

మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు, రైతులకు రుణమాఫీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయడానికి సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల హామీలు అయిన పేదలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంపు, వరికి ఐదు వందల రూపాయల బోనస్, రాష్ట్రంలో ఐటిఐలను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి టాటా టెక్నాలజీస్ తో ఒప్పందం మరో మంచి ముందడుగు.

ముఖ్యమంత్రి కాళ్లలో కట్టెలు పెట్టేవాళ్ళు సొంత పార్టీలో కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉంది కాబట్టి రేవంత్ ఓటర్లనే కాకుండా కేంద్ర నాయకత్వాన్ని కూడా సంతుష్టులను చేస్తున్నారా లేదా అని రాజకీయ పరిశీలకులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.

2015 జూలై మొదటి వారంలో హైదరాబాద్ పాతబస్తీలోని చంచల్ గూడ జైలు నుంచి ఎత్తైన జూబ్లీహిల్స్ ప్రాంతంవరకు ఒక భారీ ర్యాలీ జరిగింది. దారి పొడవునా ’టైగర్ రేవంత్ అ న్నా!’ అనే నినాదాలు మార్మోగాయి. తెలుగుదేశం పార్టీ గు ర్తు కలిగిన పచ్చ జెండాలు హైదరాబాద్ పురవీధుల్లో రెపరెపలాడాయి. అప్పటికే తెలంగాణా విడిచి వెళ్ళిపోయిన పక్క రా ష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది చూసి ఉంటే బహుశా పొరపాటున తెలంగాణా వదిలి వచ్చేశానా అని క్షణంపాటు చింతించేటంతటి కోలాహలం. నగరం ప్రధాన కూడళ్ళలో రేవంత్ రెడ్డి ఫొటోలతో హోర్డింగులు, పోస్టర్లు వెలిశాయి. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఒక టీఆర్‌ఎస్ శాసనసభ్యుడి చేత తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రే రణ మేరకు రేవంత్ రెడ్డి డబ్బు ఎర చూపారన్న ఆరోపణ మీద అరెస్ట్ అయి నెలరోజులు జైలులో ఉండి బెయిల్ మీద విడుదల అయిననాటి దృశ్యాలు అవి. అప్పటికి ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు.
భవిష్యత్తు తమ కళ్ళ ముందు కనిపించిందా అ న్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమాను లు దిక్కులు పిక్కటిల్లేలా రేపటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నినాదాలు చేసారు. దీనిని ఒక వర్గం మీడియా వెక్కిరించింది కూడా. రేవంత్ రెడ్డి రాజకీయంగా ‘ఖతం’ అయినట్టేనని జో స్యాలు కూడా చెప్పింది. ఈ సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడిచాయి. ఆనాటి అభిమానుల జోస్యం ఫలిం చి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కాలేదు. దాదాపు ఎనిమిదేళ్ళు ఆయన ఒక బలమయిన ప్రాంతీయశక్తి, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమసంస్థ అయిన తెలంగాణా రాష్ట్ర సమితికి ఎదురు నిల్చి నానా ఇబ్బందులూ పడ్డాడు. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లో 2018 ఎన్నికల్లో అష్ట దిగ్బంధనం చేసి ఓడించారు. కాంగ్రెస్ లో చేరి పార్టీలో అంతర్గత సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొని, పరిష్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయి, ఆ వెంటనే వచ్చిన లోకసభ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మల్కాజిగిరి స్థానం నుండి ఎన్నికై పార్లమెంటుకు వెళ్ళారు. పడి లేచిన కెరటంలా కాంగ్రె స్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తానూ ముఖ్యమంత్రి కాగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొత్త జవసత్వాలను ఇవ్వడమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి అదనపు బలం చేకూర్చాడు రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమతో.
రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తుచేసుకోవడం సముచితం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నిన్నటికి ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏం సాధించింది, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయగలిగిందన్న చర్చ జరగడం సహజం.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా ది పూర్తయినా పరిపాలన జరిగింది మాత్రం ఆరు నెలలే అని చెప్పుకోవాలి. లోకసభ ఎన్నికల కోడ్, అనూహ్యంగా వచ్చిపడిన తీవ్ర వరదల కారణంగా మొదటి ఆరు మాసాలు ప్రభుత్వాన్ని పరుగులు తీయించలేక పోయారన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే మొదటి హామీని అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోందని, అయితే గత ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ రూపంలో రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నట్టు ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు, రైతులకు రుణమాఫీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయడానికి సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల హామీలు అయిన పేదలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంపు, వరికి ఐదు వందల రూపాయల బోనస్, రాష్ట్రంలో ఐటిఐలను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం మరో మంచి ముందడుగు. రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు.. దీనికి దేశంలోనే ఎంతో పేరున్న మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్ చేయటం మరొకటి. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావటానికి ఇది ఉపయోగపడింది.
గత ఏడాది కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 55,143 ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ రెండింటిని గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలుగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించిన 28 నవోదయ విద్యాలయాల్లో ఏడు విద్యాలయాలు తెలంగాణకు రావడం అనేది కేంద్రంలో ఎన్డీయే ప్ర భుత్వం అధికారంలో ఉన్నా సంప్రదింపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న విజయంగానే భావించాలి.
అన్నిటికీ మించి ఈ సంవత్సర కాలంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేది ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సచివాలయానికి వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమీక్షలలో పాల్గొనడం, పరిపాలనను సచివాలయం నుండి సాగించడం. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సివస్తున్నదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి తొమ్మిది సంవత్సరాలకు పైగా అప్పటి ముఖ్యమంత్రి ఏనాడూ సచివాలయం ముఖం చూసిన పాపాన పోలేదు. ఆయన తన ఇంటి నుండో లేక తన నియోజకవర్గంలోని ఫామ్ హౌస్ నుంచో పరిపాలన సాగించినట్టుగా కనిపిస్తుంది మనకు. వాస్తు బాగా లేదన్న నెపంతో సచివాలయాన్ని పూర్తిగా కూలదోసి కొత్త సచివాలయం కట్టిన తర్వాత కూడా ఒకటి రెండుసార్లు మించి చంద్రశేఖరరావు సచివాలయానికి వెళ్ళలేదు.
ఇక జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ నుంచే రైతు భరోసా (గత ప్రభుత్వంలో రైతుబంధుగా పిలిచేవారు) పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రతిష్టాత్మ క కార్యక్రమం తరహాలోనే ఇది ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.10వేలు చొప్పున ఆర్థికసాయం అందజేశామన్నారు. ఈ పథకంలో అనర్హులు, ధనవంతులైన భూస్వాములు పెద్దయెత్తున భూములు కలిగి ఉండటం, కొన్ని సందర్భాల్లో వందలాది ఎకరాల సాగుకు నోచుకోని భూముల యజమానులు లబ్ధిదారులు కావడం గమనార్హం. ఈ మొత్తాన్ని 15 వేల రూపాయలకు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని హేతుబద్ధీకరించి 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, మధ్యతరహా రైతులకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతుభరోసా పథకంపై చర్చించి విధివిధానాలను నిర్ణయించనున్నారు. ఇదిలావుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలు రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ పుణ్యమా అని శిథిలావస్థకు చేరిన వందలాది చెరువులు, గొలుసుకట్టు నీటి వనరులకు నిలయంగా పేరొందిన హైదరాబాద్ సరస్సుల ఆక్రమణలను తొలగించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం హైడ్రా. కబ్జాలు, ఆక్రమణలవల్ల వర్షాకాలంలో రద్దీ, నీటి ప్రవాహం ఎక్కువై నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతూ రావడం చూస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాల విశ్వాసాన్ని, కోర్టు కేసులను సైతం జయించడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఏదిఏమైనా ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు.
హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహించే మూసీ నది ప్రక్షాళనపై ఆయన దృష్టి సారించారు. ఇది రేవం త్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కొత్త కార్యక్రమం కాదు. 2006 2007లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకప్పుడు ప్రజల తా గునీటి అవసరాలు తీర్చి పొలాలకు సాగునీరు అందించిన ఈ నదిని ప్రక్షాళన చేసే ప్రయత్నం జరిగింది. దురదృష్టవశాత్తు, ఈ నది పారిశ్రామిక వ్యర్థాలు, గృహ వ్యర్థాలవల్ల ఆక్రమణల కు గురై కలుషితమైంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పు డు అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నదీ పునరుజ్జీవం కోసం ప్ర త్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. విచిత్రమేమిటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న అ దే పార్టీ నేతలు ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ వంటి నిరంతరం అభివృద్ధి చెందుతున్న మహానగర భవిష్యత్తుకు, ఈ రెండు ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. హామీలను నెరవేర్చే క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాడులనుంచి తనను తాను రక్షించుకోవాల్సిన పని కూడా సీఎంపైనే పడింది.
2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో 2024 ఎ న్నికల్లో సగం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో తన అవకాశాలను మెరుగుపరుచుకుంటానని బీజేపీ ధీమాను పెంచుకుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎంకు ఒక స్థానం దక్కింది. ఆ రెండు పక్షాల దూ కుడును తట్టుకొని మరో నాలుగేళ్లపాటు తన పదవిని కాపాడుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న మరో సవా ల్. ప్రతిపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి తరచూ ఒక మాట అంటూ ఉంటారు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు అని. అంటే పని చేయనివ్వటం లేదు అడ్డు తగులుతున్నారని అర్థం. ము ఖ్యమంత్రి కాళ్లలో కట్టెలు పెట్టేవాళ్ళు సొంత పార్టీలో కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉంది కాబట్టి రేవంత్ ఓటర్లనే కాకుండా కేంద్ర నాయకత్వాన్ని కూడా సంతుష్టులను చేస్తున్నారా లేదా అని రాజకీయ పరిశీలకులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 60 ఏళ్లలో 13మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తప్ప మరెవరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారన్నది చరిత్ర. నిన్న శనివారంనాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో తొమ్మిదేళ్లు సీఎంగా తాను బాధ్యతలు నిర్వహించడం ఖాయం అన్న ఆత్మవిశ్వాసం మాత్రం మెండుగా ఉన్నది. ఆల్ ది బెస్ట్ డియర్ సీఎం!

-దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News