Monday, January 13, 2025

త్వరలో ధరణి ఫైల్స్ విడుదల చేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ లో బ్రిటిష్ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని, ధరణి మొత్తం గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉందని ఆయన ఆరోపించారు. కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనేక భూ అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమిక వివరాలు రాబట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను జూలై 15వ తేదీన తర్వాత బయటపెడతామన్నారు.
మొదటగా బిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితా
ఈ ఎన్నికల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. పేదల పక్షాన కాంగ్రెస్ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈటల రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ నుంచి ఎన్నికల కమిటీకి మార్చారని, రాజేందర్‌ను బిజెపి మోసం చేసిందన్నారు. రాజేందర్‌కు భద్రత పెంచినా అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టంగా చెప్పారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదు? నా రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం, రాజేందర్‌కు భద్రత ఏర్పాటు చేయడం సంతోషకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భూమి డిక్లరేషన్‌ను గురువారం గాంధీ భవన్‌లో టిపిసిసి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
డిక్లరేషన్ లోని అంశాలు ఇలా….
1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ -వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్ రికార్డును రూపొందిస్తాం. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
2. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
3. అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
4. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
5. వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
6. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
7. కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
8. 2006లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులకు పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
9. కేంద్రం అప్పటి యూపిఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యం లో కమిషన్ ఏర్పాటు చేస్తాం.
10. భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
11. భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News