80శాతానికిపైగా నిరుపేదలకు లబ్ధి
ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
గిరిజనుడి ఇంట్లో భోజనం చేసిన సిఎం
అతిథ్యమిచ్చిన గిరిజనుడి కుటుంబానికి సారె
అందజేసిన ముఖ్యమంత్రి
పేదవాడి ఇంట..
కంచంలో సన్నబియ్యం..
కళ్లలో ఆనందం…
స్వయంగా రుచి చూశా..
సారపాకలో లబ్ధిదారుల ఇంట..
సహపంక్తి భోజనం చేసి..
పథకం అమలును స్వయంగా పరిశీలించా.
ఎక్స్‌లో సిఎం రేవంత్
మన తెలంగాణ/బూర్గంపహాడ్/మణుగూరుః రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్ంత పూర్తి స్థాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరా వు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి సారపాకలోని తాళ్లగొమ్మూరు గ్రామ నాయక్‌పోడ్ గిరిజన తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యంతో తయారుచేసిన వంటకాలను ఆయన చవిచూశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన ఇంటికి భోజనానికి రాష్ట్రాన్ని పా లించే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రివర్యులు రావడంతో ఆ కుటుంబంతోపాటు ఆ గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లే కుండాపోయాయి.
తమ గ్రామంలోని నిరుపేదలైన గిరిజన కుటుంబంలో భోజనం చేయడానికి వచ్చిన వారికి సన్న బియ్యంతో పాటు పాయసం, పులిహోర, సేంద్రియ ఎరువులతో పండించిన తోటకూర పప్పు, గోంగూర చట్నీ, బెల్లం పానకం, వడపప్పు, ఇతర ఆహార పదార్థాలను వారు వడ్డించారు. ముఖ్యమంత్రి సంతోషంగా తనివితీరా భో జనం చేసిన తర్వాత బూరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉగాది పండుగ నుంచి ప్రారంభించామని, దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
చారిత్రాత్మకమైన ఘట్టంలో ప్రజలను భా గస్వాములను చేస్తున్నామని, 80 శాతానికి పైచిలుకు బడుగు బలహీ న, దళిత, గిరిజన, మైనార్టీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. అనంతరం బూరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి మాట్లాడుతూ.. తన భర్త శంకర్‌రావు జిసిసి సేల్స్‌మెన్‌గా పనిచేసి 2015లో పదవీ విరమణ పొందారని, తన కుమారుడు ఎంఎ బిఈడి వరకు చదువుకొని కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. తన కూతురు చిన్నప్పటి నుండే మానసికంగా, కనుచూపు లేక చాలా అవస్థలు పడుతోందని సిఎం దృష్టికి తీసుకువచ్చింది. దీం తో ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని జి ల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పినపా క, భద్రాచలం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రా వు, తహసీల్దార్ ముజాహిద్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తోబుట్టువుగా పండుగ పూట ఇంటికి రావడం
ఆనందంగా ఉంది: పద్మావతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోబుట్టువుగా పండుగ పూట తన ఇంటికి రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ తల్లి పద్మావతి ‘మన తెలంగాణ’కు తెలిపారు. తన ఇంట్లో రేషన్ బియ్యంతో వడ్డించిన భోజనం చేయడం ఆనందంగా ఉందని, కూరలు రుచిగా ఉన్నాయని సిఎం చెప్పారని, తనకు చీర, సారె అందించడంతో తనకు తోబుట్టువులు లేరు కాబట్టి పండుగ రోజున దేవుడే అన్నగా పంపించి ఉంటారని ఆనందభాష్పాలతో వెల్లడించింది.