తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతు కుటుంబం నుంచి జన్మించిన మట్టి బిడ్డకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఎనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన సతీమణి గీత, తండ్రి ఎనుముల నర్సింహా రెడ్డి, తల్లి ఎనుముల రామచంద్రమ్మ.
రేవంత్ తల్లిదండ్రులకు ఏడుగురు మగ సంతానం, ఒక కుమార్తె ఉన్నారు. రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి, ఎంపి సూదిని జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గీత దంపతులకు కుమార్తె నహీనిషా ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో సొంత ఇల్లు ఉంది. ఇప్పటికి రేవంత్ రెడ్డి పండుగలకు, గ్రామంలో జరిగే కార్యాలకు వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.
విద్యాభ్యాసం
రేవంత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొండారెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. 6, 7 తరగతులు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని జెడ్పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. వనపర్తిలోని తన సోదరులు ఎనుముల భూపాల్ రెడ్డి నివాసంలో ఉంటూ ఇంటర్మీడియట్‌ను పూర్తి చేశారు.
డిగ్రీ విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటి ద్వారా ఫైన్ ఆర్ట్ సబ్జెక్టు పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం హిమాయత్‌నగర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ సొంతంగా ఏర్పాటు చేసి నిర్వహించారు. జూబ్లిహిల్స్ క్లబ్ సెక్రటరిగా రేవంత్ సొసైటి ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు జాగృతి అనే దినపత్రికలో పాత్రికేయుడిగా సైతం పనిచేశారు.