హైదరాబాద్: గత ఎన్నికల్లో డిపాజిట్ రాని బిజెపి పార్టీ బిసి ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బిజెపి పార్టీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని, ఈ ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో బిజెపి డిపాజిట్లు గల్లంతు అవుతాయని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. బిజెపి 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒకరు మాత్రమే ఓబిసి ముఖ్యమంత్రి ఉన్నారని, బిసి కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా బిజెపి పట్టించుకోవడం లేదని రేవంత్ ఆరోపించారు. బిసి కుల గణన చేయలేని పార్టీ బిసిని సిఎం ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలో ఓ హోటల్‌లో మీట్ ది ప్రెస్ కార్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బిజెపి హామీ ఇచ్చిందని, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తెస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ తీసుకురావచ్చని, కానీ, మాదిగల దృష్టి మరల్చేందుకు బిజెపి ఎత్తుగడలు వేస్తోందన్నారు. బిజెపి చెప్పే మాటలు దళితులు ఎవరూ నమ్మరని, ఎన్నికలు అయ్యాక ఎస్సీ వర్గీకరణ హామీని బిజెపి పట్టించుకోదన్నారు.
మందకృష్ణకు విజ్ఞప్తి చేస్తున్నా….
మందకృష్ణకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, ఢిల్లీ వెళదాం, మోడీని కలిసి ఆర్డినెన్స్‌కు మద్దతు ఇస్తామని చెబుతానని, అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోడీని కొరదామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డీనెన్స్ ఇవ్వొచ్చు, అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తామన్నారు.
తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాలి
తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన, సమైక్య పాలకుల ఆధిపత్యం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసమని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే ఆకలినైనా భరించింది కానీ, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని ఆయన గుర్తుచేశారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆయన ఆరోపించారు.
అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని, ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచామన్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, గతంలో కాంగ్రెస్ సిఎంగా పనిచేసిన వారు ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ విధంగా ఆదర్భార్‌ను తిరిగి పునరుద్ధరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.