Sunday, January 19, 2025

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా ఓట్ల వేట: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత తొమ్మిదేళ్లుగా దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బిజెపి అవలంభిస్తోందని మల్కాజ్ గిరి ఎంపి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం లోక్ సభలో ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బిజెపి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రధానికి ఆదివాసీలు, గిరిజనుల పట్ల చులకనభావం ఉందని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజైనా ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి దేశంలో ఆదివాసీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులపై స్పందిస్తారని అంతా భావించామని కానీ ఆయన రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీలు, గిరిజనులపై ప్రధానికి చులకనభావమన్నారు.

మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో ఆడబిడ్డలు కాలిపోయి, అక్కడి ప్రజల తలలు తెగిపడుతుంటే బాధ్యత వహించాల్సిన ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నారని ఆరోపించారు. మణిపూర్‌లో గిరిజనులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రాముడిని, భజరంగ్ దళ్‌ను రాజకీయాలకు వాడుకుందామని చేసిన ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. బిజెపికి ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఎన్‌డిఎ అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని సభకు వచ్చి మణిపూర్ ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించేలా ఆదేశించాలని 140 కోట్ల దేశ ప్రజల తరపున తాను స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బిజెపి మేనిఫెస్టోలు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

మోదీ నినాదం వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ ట్యాక్స్ కాదు. ఆయన నినాదం వన్ నేషన్ వన్ పర్సన్, ఇది శోచనీయం, దేశానికి అవమానం..అని బిజెపి తీరును రేవంత్ దుయ్యబట్టారు. గత తొమ్మిదేళ్లుగా మోదీ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ నెరవేరలేదని ఆయనన్నారు. నల్లధనం వెనక్కు తెచ్చి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే గొగోయ్ ఇండియా కూటమి తరపున ఇచ్చిన అవిశ్వాసాన్ని సమర్దిస్తున్నా అన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News