తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృహత్తర నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గ త ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎ క్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర త్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్‌తో పాటు ఇటు కృష్ణా బేసిన్‌లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి ఆరా తీశారు.
రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పా రించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కా ల్వలు నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాల ని అధికారులకు సూచించారు. ఇందులో భాగం గా గోదావరి బేసిన్‌లో ఉన్న నీల్వాయి ప్రాజెక్ట్, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, దాదాపు 48 వే ల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం అంచనాలు రూపొందించింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. నీల్వాయి ప్రాజెక్ట్ ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది.