Thursday, December 19, 2024

’రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా’: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాజంపేట్: రాష్ట్రంలోని రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు పంట బీమానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని నిరుద్యోగ దీక్ష కోసం వెళుతూ మార్గమధ్యలో కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామంలో మంగళవారం అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యాలా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రైతుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.

Also Read: కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

ఈ నెపాన్ని బిఆర్‌ఎస్ కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కొంటేనే కొంటామంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని తెలిపారు. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారని, కామారెడ్డిలోని పొందుర్తి ప్రాంతంలోనే వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి, ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని, అలాగే మామిడి తోటలకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని పేర్కొన్నారు. పంట నష్టం పరిశీలించకుండా మంత్రులు, ఎంఎల్‌ఎలు ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో దావత్‌లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. శాసన సభ్యులు, ఐఎఎస్ అధికారులను క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడతామని కాంగ్రెస్ నేతలు పంట నష్టం వచ్చిన జిల్లాల్లో పర్యటించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి వరిధాన్యాల కుప్పలను పరిశీలించారు. గురువారం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల వివరాలు అడిగి తెలుసుకుని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్న భరోసానివ్వాలన్నారు. ఈ విషయమై బిజెపి చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. పిసిసి చీఫ్ రేవంత్ వెంట మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ఇంద్రకిరణ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మండల అధ్యక్షుడు యాదవ్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు కృష్ణారావు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News