హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పరిశీలన కోసం ఖమ్మం వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీగా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భారీ ఎత్తున సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులు అడిగారన్నారు. ఆర్టీసీ అధికారులు ముందు బస్సులు ఇస్తామని, ఇప్పుడు బస్సులు ఇవ్వలేమని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఇచ్చిన ఇవ్వకున్నా సొంత వాహనాల్లో సభకు రావాలని రేవంత్ పిలపునిచ్చారు.
ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఏమాత్రం అడ్డుకోలేరన్నారు. బిఆర్ఎస్ ఆవిర్భావ సభను మించేలా కాంగ్రెస్ సభను పొంగులేటి నిర్వహిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. కావాలంటే బిఆర్ఎస్ నేతలు.. సభలో తలలు లెక్క పెట్టుకోవచ్చని సూచించారు. ఖమ్మం సభ నుంచే బిఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి కడతామని రేవంత్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు భట్టి ఒక కన్ను, రేణుక మరో కన్ను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.