Sunday, December 22, 2024

ప్రకృతిని కాపాడుతున్న యోధ రేవంత్!

- Advertisement -
- Advertisement -

‘పిల్లి నలుపా, తెలుపా అని కాదు.. ఎలుకను పట్టిందే పిల్లి’ అని చైనా నేత డెంగ్ జీపింగ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ధైర్యసాహసాలతో హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలైన చెరువులు, జలాశయాల ఆక్రమణలకు ముగింపు పలికే చర్యలకు పూనుకున్నారు. దీంతో ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ సంగతి బిఆర్‌ఎస్ నాయకులు కూడా పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. కానీ బహిరంగంగా చెప్పలేరు. తాము విఫలమైన పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే చేపట్టడం బిఆర్‌ఎస్ నాయకత్వానికి భారీ షాక్! అసాధ్యమైన సవాళ్ళను స్వీకరించలేనివాళ్ళు ఎప్పుడూ గొప్పవారు కాలేరు.

పాత పంథాను సమూలంగా నిర్మూలించి కొత్త పంథాను ఎంచుకోవాలి. పాము తన కుబుసాన్ని విడిచిన విధంగానే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళితేనే సక్సెస్ సాధ్యమవుతుంది.రాజకీయాల్లో ‘ప్రధాన విలన్’ను దెబ్బకొట్టాలంటే ముందుగా మానసికంగా గందరగోళపరచాలి. బలహీనపరచాలి. దాంతో సహజంగానే ప్రత్యర్ధులు ఆత్మరక్షణలో పడిపోతారు. దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ ఫార్ములాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్షరాలా అనుసరిస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గంభీరంగా ప్రసంగాలు చేసిన గత పాలకులు గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువులు, జలాశయాల కబ్జాను నిర్లక్ష్యం చేశారు. లేదా కబ్జాదారులతో లాలూచీపడ్డారన్న అపకీర్తిని మూట కట్టుకున్నారు.

రేవంత్ రెడ్డి చర్యల వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ వేలు పెట్టలేని వ్యవహారంలో తలదూర్చి, ఎన్నో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు చుట్టుముడతాయని తెలిసీ, తన కుటుంబ సభ్యులు, సొంత మనుషులు, స్వపరివారం, కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ నాయకులు… ఎవరు భూకబ్జాలకు, చెరువుల కబ్జాలకు పాల్పడ్డా రాజకీయాలకు అతీతంగా శషభిషలు లేకుండా ‘హైడ్రా’ క్షిపణితో కూల్చివేస్తుండడం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితర నేతలు, యావత్తు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి నైతిక బలాన్ని ఇస్తున్నారు.

కాంగ్రెస్‌లో ఇదొక శుభ పరిణామం. హైదరాబాద్ నగరంలో, శివారు జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించకపోవడానికి, కెసిఆర్‌ను ఆదరించడానికి సెటిలర్లే కారణం. అయితే ‘హైడ్రా’ చర్యలతో హైదరాబాద్ చుట్టూ నివసిస్తున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల్లో రేవంత్ రెడ్డికి విపరీతమైన ‘గ్లామర్’ వచ్చింది.
‘చెరువుల ఆక్రమణ గత పదేళ్ల క్రితమే మొదలయినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.కానీ ఇరవై ఏళ్ల క్రితం ప్రముఖ పరిశోధనా సంస్థ ‘సెస్’లో మిత్రుడు, ప్రొఫెసర్ రామచంద్రయ్య సేకరించిన వివరాల ప్రకారం 1990 తరువాత వలసలు పెరిగి, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.

నిజానికి హైదరాబాద్ చెరువులతో విలసిల్లిన నగరం. ఈ నగరానికి పునాదివేసిన కుతుబ్ షాహీ రాజులు 1534- 1724 మధ్యకాలంలో సహజ సిద్ధమైన చెరువులను కాపాడుతూ వచ్చారు. తరువాత వచ్చిన అసఫ్ జాహీ పాలకులు 1724- 1948 మధ్య ఫ్రెంచ్, బ్రిటీష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులు నిర్మించారు. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం చెరువులను తాగునీటి కోసం నిర్మించారు. 1960 -70 ల దాకా కాలువల ద్వారా నీళ్లు పారేవి. 1985 తరువాత కోస్తా వలసలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ఈ వలసలు వంద రెట్లు పెరిగి చెరువులు తరగడం మొదలయ్యింది. కొత్తగా రియల్ ఎస్టేట్ అనే కొత్త జాతి వెలుగులోకి వచ్చి పఠాన్ చెరువు, అమీన్‌పూర్ చెరువు మొదలు దుర్గం చెరువు, పేరం చెరువు, సరూర్‌నగర్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, యూసఫ్‌గూడ చెరువు.. ఇలా వందలాది చెరువుల చుట్టూ వేలాది ఎకరాలను కబ్జాచేసి, ప్లాట్లు వేసి కొత్త కాలనీలను కట్టేసింది. అప్పటి ప్రభుత్వం దీనిని ప్రోత్సహించింది. చంద్రబాబునాయుడు కాలంలో ప్రభుత్వమే కనీసం పది పెద్ద చెరువులను పూడ్చి పార్కులుగా మార్చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడింది.

చాచా నెహ్రూ పార్కు, కృష్ణకాంత్ పార్క్, సఫిల్‌గూడ పార్క్, సరూర్‌నగర్ పార్క్ అలా వచ్చినవే. అప్పుడు మొదలైన కబ్జాలు ఇప్పుడు చెరువులను పూర్తిగా మింగేసే స్థాయికిచేరాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఆక్రమణలు పూర్తిగా తొలగించి చెరువులను శుద్ధి చేస్తే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు’ అంటూ టీఎస్పీఎస్సి మాజీ చైర్మన్, మిత్రుడు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆయన ఉద్దేశంలో 1. పదేళ్ల కిందట కబ్జాలు మొదలు కాలేదు. 2. కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి భర్తీ వలసలు. 3. రియల్ ఎస్టేట్ సంస్థలు వందలాది చెరువులను చెరబట్టాయి. 4. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వమే ఈ క్రిమినల్ చర్యల్ని ప్రోత్సహించింది.

చక్రపాణి పరిశీలన, వాదనలతో అందరం ఏకీభవించాలన్న రూల్ ఏమీ లేదు. గత ప్రభుత్వ హయాంలోనే చెరువుల కబ్జాలు జరగలేదని, అదివరకే జరిగిందని, అదంతా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందని పరోక్షంగా చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ‘ఆ పాపం’తో కేసీఆర్‌కు, ఆయన పాలనకు సంబంధం లేదని కూడా సందేశం ఇస్తున్నట్టు భావించాలి. ‘లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు’ అని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన, ‘తెలంగాణ ప్రజల పొట్టకొట్టే వారి’ గురించి మాట్లాడినవారెవరు? తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష జ్వాల ఆరిపోకుండా నిరంతరం ఆజ్యం పోసింది ఎవరు? కోస్తాంధ్ర వలసలపై విషం కక్కింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన నేతలు పదేళ్ల పాటు హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల గురించి ఎందుకు దృష్టి పెట్టలేదు? రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సామ్రాజ్యాలు 2014 కు ముందు, 2014 తర్వాత కూడా తెలంగాణేతరుల చేతుల్లోనే ఎలా విలసిల్లాయి? ఐ.టి. రంగం విస్తరణ, పబ్బుల సంస్కృతి, డ్రగ్స్, ఆకాశమంత ఎత్తున భవంతులు, ఫ్లై ఓవర్లు… ఎవరి హయాంలో జరిగాయి? ఎవరు వాటిని ప్రోత్సహించారు? కోస్తాంధ్ర, రాయలసీమ కాంట్రాక్టర్లకు, నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టింది ఎవరు?

‘జీహెచ్‌ఎంసి పరిధిలో 134 జలాశయాల్లో 14 వేల ఆక్రమణలు జరిగినట్టు, ఎఫ్టిఎల్ పరిధిలో 8 వేలు, బఫర్ జోన్ లో 9 వేలు ఆక్రమణలకు గురైనట్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్.జీ.టి) విచారణ సందర్భంగా 2022 నవంబర్ లోనే అప్పటి ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. చెరువులను మాయం చేసిన సమయం, సందర్భం ఏదైనా కావచ్చు. ప్రభుత్వం ఏ పార్టీదైనా కావచ్చు… తెలంగాణ సహజ వనరులను రక్షించుకోవడం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండులో అత్యంత ముఖ్యమైనది! సహజ వనరులైన భూములు, చెరువులు, గనులు, ఇతర సంపదను కాపాడుకోవలసిన కర్తవ్యం ఎవరిది? తెలంగాణవాదులది కాదా?

విశాలాంధ్ర పాలక వర్గాలు బాహాటంగా తెలంగాణ ప్రజలపై క్రూరత్వం ప్రదర్శించలేదు, కానీ అంతకుమించిన విధ్వంసానికి పాల్పడ్డారు. సాంస్కృతిక అణచివేతను వలసవాదులు కొనసాగించారు. తెలంగాణలో బతుకమ్మ అంటే ఒక ఎండిపోయిన చెరువు. చారికగా మిగిలిన వాగు. ఒక వాడిపోయిన పూల పేర్పు. గ్రామాలలో బతుకమ్మ ఆడడమే తగ్గిపోయింది. బతుకమ్మను పేర్చడానికి పూలు లేవు. బతుకమ్మను ముంచడానికి చెరువులు లేవు. జమ్మిచెట్టూ లేదు. పాలపిట్టా లేదు. తెలంగాణ ప్రకృతి వనరులు క్షీణించడమే ఇందుకు కారణం.(2024 కు ముందు పరిస్థితి). కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిన మాట నిజమే! మిషన్ కాకతీయలో జరిగిన అవకతవకలు, అవినీతి… అది వేరే అంశం.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసమే అవతరించినట్టు చెప్పుకున్న ఎమ్మెల్సీ కవిత ‘తెలంగాణ జాగృతి’ జలాశయాల విధ్వంసంపై ఉద్యమం నడిపితే బాగుండేది. కేవలం ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఆడడం ఒక్కటే ఆ సంస్థ ప్రధాన కార్యక్రమంగా మనం అందరం చూశాము. ఇక సాధారణంగా ప్రజలు ఐఏఎస్ అధికారులకు ఇచ్చినంత మద్దతు ఐపీఎస్ అధికారులకు ఇవ్వరు. పోలీసు అధికారులు ఏ స్థాయివారైనా అత్యంత అరుదుగా ప్రజాదరణ పొందుతారు. ‘హైడ్రా’ కమిషనర్‌గా రంగనాథ్ ఎంపిక లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి పొరబాటు చేయలేదని తేలిపోయింది. రంగనాథ్‌కు ‘హీరో’ ఇమేజ్ రావడం చూస్తున్నాం. లౌక్యం, నైపుణ్యం, చాకచక్యం, అనుభవం, పకడ్బందీ వ్యూహంతో సిఎం రేవంత్ రెడ్డి ‘టాస్క్’ను పూర్తి చేస్తున్నారు.

ఎస్.కె. జకీర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News